Begin typing your search above and press return to search.

మన్ కీ బాత్ 114వ ఎపిసోడ్.. దీని ప్రత్యేకత ఏమిటంటే..?

మన్ కీ బాత్ (మనసులో మాట) పేరుతో ప్రతీ నెల చివరి ఆదివారం ప్రధాని మోడీ ప్రసంగిస్తారనే సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   29 Sep 2024 10:08 AM GMT
మన్  కీ బాత్ 114వ ఎపిసోడ్.. దీని ప్రత్యేకత ఏమిటంటే..?
X

మన్ కీ బాత్ (మనసులో మాట) పేరుతో ప్రతీ నెల చివరి ఆదివారం ప్రధాని మోడీ ప్రసంగిస్తారనే సంగతి తెలిసిందే. తాజాగా నేడు జరిగింది 114వ ఎపిసోడ్. అయితే దీనిలో ఓ ప్రత్యేకత ఉంది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా వెళ్లడించారు. అదే... ఈ కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తిచేసుకోనుంది.

అవును... మనసులో మాట పేరుతో ప్రతినెలా లాస్ట్ సన్ డే నిర్వహించే "మన్ కీ బాత్" ప్రోగ్రాం 114వ ఎపిసోడ్ లో మోడీ తాజాగా ప్రసంగించారు. ఈ కార్యక్రమం ప్రారంభించి పదేళ్లు పూర్తిచేసుకోనున్న నేపథ్యంలో ఇది తనకు ఎంతో భావోద్వేగమైందని మోడీ అన్నారు. దేశంలోని ప్రజల ప్రయత్నాలు, స్పూర్తిదాయక కథనాలను మన్ కీ బాత్ చూపిస్తోందన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ... "నా ప్రియమైన దేశప్రజలారా అందరికీ నమస్కారం. మరోసారి మన్ కీ బాత్ తో కనెక్ట్ అయ్యే అవకాశం వచ్చింది. ఈ ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురి చేస్తుంది.. ఇది చాలా జ్ఞాపకాలతో నన్ను చుట్టుముడుతుంది.. కారణం ఈ ప్రయాణం 10 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది" అని అన్నారు.

పదేళ్ల క్రితం అక్టోబరు 3న విజయదశమి రోజున "మన్ కీ బాత్" ప్రారంభించామని.. ఈ ఏడాది అక్టోబరు 3న ఈ కార్యక్రమం పదేళ్లు పూర్తిచేసుకోనుందని.. ఇది ఎంతో పవిత్రమైనదని తెలిపారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయని.. వాటిని తాను ఎప్పటికీ మరిచిపోలేనని ప్రధాని పెర్కొన్నారు.

ఈ సందర్భంగా... ఈ మన్ కీ బాత్ ద్వారా తన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియాకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా స్ఫూర్తివంతమైన కథలు, ప్రేరణ పొందే వ్యక్తులకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

సాధారణంగా మసాలా లేని వార్తలు, కంటెంట్ ను ప్రజలు పట్టించుకోరనే అభిప్రాయం ఉండేదని.. అయితే.. మన్ కీ బాత్ కార్యక్రమం ఆ అభిప్రాయాన్ని మార్చేసిందని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో నీటి నిర్వహణ గురించి ప్రస్తావించిన ఆయన.. నీటి సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

ఈ నేపథ్యంలో "తల్లి పేరిట మొక్క" కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని.. ఈ కార్యక్రమం పేరిట గుజరాత్ లో సుమారు 15 కోట్లు, ఉత్తర ప్రదేశ్ లో 26 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు తెలిపారు. ఇదే సమయంలో క్రియేట్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం కావాలంటూ నూతన ఉత్పత్తుల తయారీదారులకు ప్రధాని పిలుపునిచ్చారు.

కాగా... 2014 అక్టోబరు 3న తొలిసారిగా మన్ కీ భారత్ కార్యక్రమం ప్రరంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం 22 భారతీయ భాషలు, 29 మాండలికాలతోపాటు 11 విదేశీ భాషలలో కూడా ప్రసారం చేయబడుతోంది. ఇందులో చైనీస్, ఫ్రెంచ్, ఇండోనేషియన్, టిబెటన్, బర్మీస్, అరబిక్, బలూచి, పర్షియన్, పష్టు, స్వాహిలీ, డారీ లు ఉన్నాయి.