ఎన్డీయేకు కొత్త అర్థం చెప్పిన మోడీ
కూరలో కరివేపాకు మాదిరి పక్కన పెట్టేసిన తీరు గడిచిన పదేళ్లలో చూసిందే.
By: Tupaki Desk | 7 Jun 2024 12:38 PM GMTఎన్డీయే కూటమిగా పిలుచుకునే బీజేపీ దాని మిత్రపక్షాల కూటమి మొత్తాన్ని మోడీనే వన్ మ్యాన్ షో చేస్తుంటారన్నది తెలిసిందే. ఇంతకూ ఎన్డీయే కూటమి పూర్తి అర్థం ఏమిటన్నది చూస్తే.. జాతీయ ప్రజాస్వామ్య కూటమి. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే పేరులో కనిపించే ప్రజాస్వామ్యం కూటమిలో ఉండదు. 2014, 2019లో రెండుసార్లు బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మద్దతును ఓటర్లు ఇవ్వటంతో మిగిలిన కూటమి నేతలకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూరలో కరివేపాకు మాదిరి పక్కన పెట్టేసిన తీరు గడిచిన పదేళ్లలో చూసిందే.
టార్గెట్ 400 పేరుతో తాజా ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ ఎన్నికల ఫలితాలు మాత్రం అంచనాలకు భిన్నంగా.. షాకింగ్ గా రావటం తెలిసిందే. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టాలని తహతహలాడిన మోడీకి.. బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 272 సీట్లు రాకపోవటం.. మిత్రుల మీద ఆధారపడాల్సి వచ్చింది. అదే సమయంలో చంద్రబాబు.. జనసేన కూటమి దక్కించుకున్న 18 సీట్లు ఇప్పుడు ఎన్డీయేకు ప్రాణవాయువుగా మారాయి.
బాబు పక్క చూపులు చూస్తారేమో అనుకున్నప్పటికీ అలాంటిదేమీ లేకుండా.. ఎన్నికల ముందు ఇచ్చిన కమిట్ మెంట్ ను ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతానని చెప్పటంతో కేంద్రంలో మోడీ సర్కారుకు రంగం సిద్ధమవుతోంది. తాజాగా ఎన్డీయే కూటమి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలతో పాటు.. దాని మిత్రపక్షాల ఎంపీలు ఆయా పార్టీల అధినేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇంతకాలం ఎన్డీయేకున్న పేరుకు కొత్త అర్థాన్ని చెప్పటం గమనార్హం. గడిచిన ముప్ఫై ఏళ్లలో దేశాన్ని ఎన్డీయే కూటమి మూడుసార్లు పాలించిందని.. మరోసారి ఐదేళ్లు పాలనకు ప్రజలు అవకాశం ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఎన్డీయే అంటేనే సుపరిపాలన అన్న ఆయన.. ఈ కూటమికి ఇప్పటివరకున్న అర్థానికి భిన్నంగా కొత్త అర్థాన్ని చెప్పుకొచ్చారు. అదేమంటే.. ‘న్యూ ఇండియా.. డెవలప్ డ్ ఇండియా.. ఆస్పిరేషనల్ ఇండియా’ అంటూ కొత్త భాష్యాన్ని చెప్పుకొచ్చారు.
తమ కూటమిని దక్షిణాది ప్రజలు ఆదరించారన్న ఆయన.. కర్ణాటక.. తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని.. అయితే అతి తక్కువ కాలంలోనే అక్కడి ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వైనం తాజాగా వెల్లడైన ఎన్నికల ఫలితాలు చెప్పాయన్నారు. తమిళనాడులో సీట్లు గెలవకున్నా.. ఓట్లు పెరిగిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. కేరళలో తమ కార్యకర్తలు ఎన్నో బలిదానాలు చేశారన్నారు. తొలిసారి ఆ రాష్ట్రం నుంచి తమ ప్రతినిధి ఒకరు సభలోకి అడుగు పెడుతున్నట్లు చెప్పారు.
అరుణాచల్ ప్రదేశ్.. సిక్కింలో క్లీన్ స్వీప్ చేశామని.. ఏపీ ప్రజలు కూటమికి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చంద్రబాబుతో కలిసి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నట్లుగా చెప్పిన మోడీ.. ఏపీలో ఇంత భారీ విజయం ప్రజల ఆకాంక్షలను అద్దం పట్టిందన్నారు. 2024 ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధించినా.. విపక్షాలు మాత్రం తమ విజయాన్ని తిరస్కరించే ప్రయత్నం చేశాయన్నారు.
తాము ఓడిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారని.. కానీ తాము ఓడిపోలేదని దేశ ప్రజలకు తెలుసన్నారు. ఇకనైనా విపక్షాలు పార్లమెంట్ లోకి వచ్చి చర్చలో పాల్గొంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ చాలా వేగంగా పతనమవుతుందన్న ఆయన.. పదేళ్ల తర్వాత కూడా ఆ పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో తమ సొంత ప్రధానమంత్రినే అవమానించారన్న మోడీ.. మరో పదేళ్లు దాటిన తర్వాత కూడా వంద సీట్ల సంఖ్యను దాటదని చెప్పటం గమనార్హం.