Begin typing your search above and press return to search.

ఢిల్లీ సీఎం ఎంపికలోనే మోడీ మాష్టారి వ్యూహాం అదేనా?

దినపత్రికలు పెద్ద ఎత్తున పేర్కొన్న పేర్లలో ఏ ఒక్కరికి ముఖ్యమంత్రి పదవి రాదన్న వాదనను కొందరు పొలిటికల్ జర్నలిస్టులు వినిపించారు.

By:  Tupaki Desk   |   20 Feb 2025 4:54 AM GMT
ఢిల్లీ సీఎం ఎంపికలోనే మోడీ మాష్టారి వ్యూహాం అదేనా?
X

సక్సెస్ ఫుల్ ఫార్ములా ఒకటి చేతిలో ఉన్నప్పుడు కొత్త వ్యూహాలకు తెర తీయాల్సిన అవసరం ఏముంది? ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేస్తూ బీజేపీ అధినాయకత్వం నిర్ణయం వెలువడిన తర్వాత.. ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోలేదనే చెప్పాలి. నిజానికి ఇలా ఎంపిక కాకపోతేనే ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే.. కొన్ని పేర్లు సీఎం రేసులో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి.

దినపత్రికలు పెద్ద ఎత్తున పేర్కొన్న పేర్లలో ఏ ఒక్కరికి ముఖ్యమంత్రి పదవి రాదన్న వాదనను కొందరు పొలిటికల్ జర్నలిస్టులు వినిపించారు. దీనికి కారణం లేకపోలేదు. అందరి అంచాలకు తగ్గట్లు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టేందుకు మోడీ అండ్ కో సిద్ధంగా ఉండదు. నిజానికి.. దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులను ఒకసారి చూస్తే.. ఒకరిద్దరు మినహాయిస్తే.. మిగిలిన వారంతా ఎవరికి తెలియని నేతలే ఉంటారు. ఆయా రాష్ట్రాల్లోనూ సీఎం పదవికి సరిపోయే వ్యక్తులుగా అక్కడి వారు సైతం ఊహించని వ్యక్తుల్ని తెర మీదకు తీసుకొచ్చి రాష్ట్ర పగ్గాల్ని చేతిలో ఉంచటం మోడీషాలకు అలవాటే.

మరి యోగి ఆదిత్యనాథ్ సంగతేమిటి?అన్న సందేహం కొందరికి రావొచ్చు. వాస్తవానికి యోగి మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ముఖ్యమంత్రా? అంటూ రాజకీయ వర్గాలు సైతం విస్మయానికి గురయ్యాయి.అయితే.. పాలనతో తన మార్కును చూపించటమే కాదు.. ఈ రోజున మోడీ తర్వాత బీజేపీకి ఆశాకిరణంగా మారిన నేత ఎవరైనా ఉన్నారా? అంటే యోగినే కనిపిస్తారు. తప్పనిసరి పరిస్థతుల్లో రెండోసారి ఆయన్నే సీఎంగా కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఎంపికైన మొదటిసారి ఎవరికి పెద్దగా తెలీదు. పాలనలో తన మార్క్ ప్రదర్శించలేకపోయినప్పటికీ.. మహారాష్ట్రరాజకీయాల్ని తట్టుకొని నిలవటం.. మోడీషాలకు అపర విధేయుడిగా ఉండటంతో ఆయనకు తాజా ఎన్నికల ఫలితాల తర్వాత అవకాశం లభించిందని చెప్పాలి.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఎంపికైన వారిలో జాతీయ స్థాయిలో అంతో ఇంతో పేరున్న మరో నేతగా హిమంత బిశ్వ శర్మ..అయితే..ఆయన బీజేపీలో చేరటానికి ముందే ప్రముఖుడన్న విషయం తెలిసిందే. వీరు మినహాయించి.. పేరు ప్రఖ్యాతులన్న వారిని ముఖ్యమంత్రులుగా చేసే విషయంలో మోడీ చాలా కఠినంగా ఉంటారు. జాతీయస్థాయిలో ఫేం ఉన్న వారిని సీఎంలుగా ఎంపిక చేసేందుకు ఆయనకు ఇష్టముండదన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేయటం కూడా ఇదే కోవకు చెందినట్లుగా చెప్పాలి. అలవాటైన ఫార్ములాకు మించిన సుఖం ఇంకేం ఉంటుంది చెప్పండి.