Begin typing your search above and press return to search.

ఉమెన్స్ డే స్పెషల్ : మహిళల చేతికి మోడీ సోషల్ మీడియా ఖాతాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   8 March 2025 2:59 PM IST
ఉమెన్స్ డే స్పెషల్ : మహిళల చేతికి మోడీ సోషల్ మీడియా ఖాతాలు
X

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. నారీ శక్తికి గౌరవం తెలియజేస్తూ, ఈ సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలను మహిళలే నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మోదీ ఒక వీడియోను పోస్టు చేసి, మహిళలకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.

వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరచిన మహిళలు ఈరోజు ప్రధాని మోదీ సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ తెలియజేశారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా న్యూక్లియర్ సైంటిస్ట్ ఎలినా మిశ్రా, స్పేస్ సైంటిస్ట్ శిల్పి సోని, చెస్ గ్రాండ్ మాస్టర్ వైశాలి, స్వయంసంపత్తిగా ఎదిగిన అనిత అనే మహిళలు ప్రధాని మోదీ సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్నారు. ఈరోజంతా వీరే పోస్టులు చేస్తారు.

ఇదే విధంగా 2020 మార్చి 8న కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాలను మహిళలకు అందించిన విషయం తెలిసిందే. ఆ ఏడాది ఏడు మంది మహిళా అచీవర్స్ ఈ ఖాతాలను నిర్వహించారు. మహిళల్లో ప్రేరణ కలిగించేందుకు, వారి విజయాలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మోదీ తెలిపారు.

ప్రధాని ప్రకటన చేసిన కొద్ది సమయానికే, ఇస్రోకు చెందిన శిల్ప, ఎలీనాలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. దేశానికి తమలాంటి వారు అందిస్తున్న సేవలను గుర్తించడం గర్వకారణమని పేర్కొన్నారు.

ఆ తర్వాత వివిధ రంగాల్లో అహర్నిశలు శ్రమిస్తూ దేశ సేవలో ఉన్న మహిళలు కూడా తమ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూనే, తాము సాధించిన విజయాలు, చేసిన సేవలు గురించి వివరంగా చెప్పుకుంటున్నారు.