సీ-295 తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన మోడీ... వీటి ప్రత్యేకతలివే!
ఈ సందర్భంగా ఈ తరహా ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రత్యేకతలు ఆసక్తికరంగా ఉన్నాయి.
By: Tupaki Desk | 28 Oct 2024 11:30 AM GMTటాటాల భాగస్వామ్యంతో ఎయిర్ బస్ సంస్థ నెలకొల్పిన సీ-295 ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రాన్ని గుజరాత్ లోని వడోదరలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ తరహా ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రత్యేకతలు ఆసక్తికరంగా ఉన్నాయి.
అవును... ఐరోపాకు చెందిన ఎయిర్ బస్ సంస్థ బయట దేశాల్లో మొట్టమొదటిసారిగా సీ-295 ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ విమానాల తయారీ కేంద్రాన్ని భారత్ లో నెలకొల్పింది. ఈ సందర్భంగా స్పందించిన భారత ప్రధాని.. ఈ ప్లాంట్ "మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్" మిషన్ ను బలోపేతం చేస్తుందని అన్నారు.
ఇదే సమయంలో.. స్పెయిన్ తో భారత భాగస్వామ్యాన్ని పెడ్రో సాంచెజ్ తో కలిసి సరికొత్త మార్గంలో తీసుకెళుతున్నామని వెల్లడించారు. ఇటీవల ముద్దు బిడ్డ రతన్ టాటాను భారత్ కోల్పోయిందని.. ఆయన జీవించి ఉంటే ఇక్కడే తమ మధ్య ఉండేవారని.. ఆయన ఎక్కడున్నా ఇది చూసి సంతోషిస్తారని మోడీ నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా స్పందించిన టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్... నేటి నుంచి కచ్చితంగా రెండు సంవత్సరాల్లో తొలి విమానం డెలివరీ చేస్తామని ప్రధాని మోడీకి హామీ ఇచ్చారు. ఆ రోజు తిరిగి ప్రధాని ఇక్కడకు వచ్చి దీన్ని ఆవిష్కరించేందుకు వీలుగా తేదీని రిజర్వ్ చేసేలా పీఎంవోను కలుస్తామని తెలిపారు!
సి-295 విమానాల ప్రత్యేకతలు:!
ఈ విమానాల్లో 40 నుంచి 45 మంది పారాట్రూపర్లు లేదా.. 70 మంది పౌరులు ప్రయాణించొచ్చు. లేదా.. 12 స్ట్రెచర్ ఇంటెన్సివ్ కేర్ మెడెవాక్.. లేదా, 27 స్ట్రెచర్ మెడెవాక్ తో పాటు నలుగురు వైద్య సిబ్బంది ప్రయాణించొచ్చు.
ఈ విమానం గరిష్టంగా 9,250 కిలోల బరువును మోయగలదు. ఇక, 80.3 అడుగుల పొడవు.. 28.5 అడుగుల ఎత్తు ఉండే ఈ విమానం రెక్కలు 84.8 అడుగులు ఉంటాయి. ఇదే సమయంలొ... 7,650 లీటర్ల ఇంధన సామర్ధ్యం కలిగి ఉండే ఈ విమానం.. గంటకు 482 కిలో మీటర్ల వేగంతో ఎగరగలవు!
ఇవి ఎగరడానికి తక్కువ దూరం రన్ వే సరిపోవడంతో పాటు తాత్కాలికంగా అభివృద్ధి చేసిన ప్రాంతాల నుంచి కూడా ఇది టేకాఫ్ అయ్యే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
ఇక ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రత్యక్షంగా 600 మంది అత్యున్నత నైపుణ్యాలు కలిగినవారికి, 3000 మంది మధ్యశ్రేణి నైపుణ్యాలు కలిగినవారితో పాటు మరో 3000 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి.