మోడీ ‘ఫోన్ కాల్’ ట్వీట్ కు మించి ట్రంప్ అప్డేట్
తాజాగా రెండోసారి అమెరికా అధ్యక్షుడి బాధ్యతను చేపట్టిన వేళ.. ఆ దేశాన్ని పర్యటిస్తున్న మొదటి ప్రధానమంత్రి మోడీనే అవుతారేమో?
By: Tupaki Desk | 28 Jan 2025 6:55 AMరెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వారానికి డొనాల్డ్ ట్రంప్ కు భారత ప్రధాని మోడీ ఫోన్ చేయటం తెలిసిందే. ఇదే విషయాన్ని సోమవారం (జనవరి 27) రాత్రి వేళలో ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ట్రంప్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. తాను అమెరికా అధ్యక్షుడితో ఫోన్ లో మాట్లాడినట్లుగా ట్వీట్ చేసిన మోడీ.. "పరస్పర ప్రయోజనం కలిగించే అంశాలకు.. విశ్వసనీయ భాగస్వామ్యానికి ఇరుపక్షాలూ కట్టుబడి ఉన్నాయి" అంటూ మోడీ ట్వీట్ చేశారు.
ఇదే అంశంపై వైట్ హౌస్ లో మీడియా ప్రతినిధులు ట్రంప్ ను ప్రశ్నించారు. ఈ సందర్భంగా మోడీకి మించిన అప్డేట్ ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయాన్నే (భారత్ లో సాయంత్రం వేళ) మోడీ తనకు ఫోన్ చేసిన విషయాన్ని వెల్లడించిన ట్రంప్.. "ఈ ఉదయం మోడీతో సుదీర్ఘంగా మాట్లాడా. భారత్ తో మనకు మంచి అనుబంధం ఉంది" అని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ఫిబ్రవరిలో మోడీ అమెరికాకు వస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు."బహుశా వచ్చే నెలలో ఆ ప్రధాని వైట్ హౌస్ కు రావొచ్చు (Modi Likely to Visit US)" అని పేర్కొన్నారు.
అక్రమ వలసదారుల అంశంపైనా మోడీతో తాను చర్చించినట్లుగా చెప్పిన ట్రంప్.. అక్రమ వలసదారులుగా వచ్చిన భారతీయులను చట్టబద్ధంగా స్వదేశానికి రప్పించే విషయంలో భారత్ సరైన నిర్ణయం తీసుకుంటుందని తాను విశ్వసిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇక్కడో ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించాలి. తొలిసారి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన వేళలో ట్రంప్ తన చివరి విదేశీ పర్యటనను భారత్ లోనే చేపట్టారు. 2020లో అహ్మదాబాద్ కు వచ్చిన ట్రంప్ మోడీతో కలిసి భారీ బహిరంగ సభలో హాజరయ్యారు.
తాజాగా రెండోసారి అమెరికా అధ్యక్షుడి బాధ్యతను చేపట్టిన వేళ.. ఆ దేశాన్ని పర్యటిస్తున్న మొదటి ప్రధానమంత్రి మోడీనే అవుతారేమో? నిజానికి మోడీ - ట్రంప్ మధ్య సన్నిహిత సంబంధాలుతో పాటు.. మోడీని ఆయన్ను అభిమానిస్తుంటారు. అయితే.. దీనికి సంబంధించిన ప్రయోజనం భారత్ కు ఏం జరిగిందన్న దానిపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదన్న మాట విమర్శకుల నోటి నుంచి తరచూ వినిపిస్తూ ఉంటుంది.