ఎక్కడికెళ్తే అక్కడే అవినీతి.. మోడీ మనసు కనిపెట్టారా?
ఈ సందర్భంగా.. మోడీ ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపైనా అవినీతి ఆరోపణలు చేశారు. అవినీతి పెరిగిపోయిందని.. 25 ఏళ్లుగా.. ఇక్కడున్న బీజేడీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.
By: Tupaki Desk | 20 May 2024 8:37 AM GMTఎక్కడికెళ్తే.. అక్కడే అవినీతి కనిపించడం.. వాటిపై వ్యాఖ్యలు చేయడం ప్రధాని నరేంద్ర మోడీకి చాలా అలవాటుగా మారిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీజేపీపాలిత రాష్ట్రాల్లో ఏం జరిగినా.. ఆయన కు పెద్దగా కనిపించదు. కానీ, బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రం.. అంతా అవినీతి కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికలకు ముందు.. ప్రచారానికి వచ్చిన మోడీకి ఇక్కడ అవినీతి ప్రభుత్వం కనిపించింది. అంతా అవినీతి పరులేనని అన్నారు. కానీ, ఐదేళ్లుగా ఆయన ఏం చేస్తున్నారనేది మాత్రం చెప్పలేదు.
నిజానికి అవినీతి పెచ్చరిల్లినప్పుడు.. కేంద్ర ప్రభుత్వంగా ఆయన అడ్డుకనే ప్రయత్నం చేయొచ్చు. ఎవరూ కాదనరు. అసలు ప్రతిపక్షాలు కూడా.. ఇదే డిమాండ్ చేశాయి. అవినీతిని ఎందుకు అడ్డుకోవడం లేదని.. గత రెండేళ్ల నుంచి ఏపీలో ఇదే మాట వినిపించింది. కట్ చేస్తే.. తర్వాత తెలంగాణలోనూ మోడీ ఇదే మాట చెప్పారు. తెలంగాణలోనూ అవినీతి పెరిగిపోయిందన్నారు. 'డబుల్ ఆర్' ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు. అంతేకాదు.. తాము అధికారంలోకి వస్తే.. అవినీతిని కట్టడి చేస్తామన్నారు.
ఇక, ఇప్పుడు తాజాగా ఒడిశాలోనూ ప్రధాని పర్యటించారు. తెల్లవారగానే 7 గంటలకల్లా ఆయన 10 కిలో మీటర్ల మేర రోడ్ షో చేశారు. మొత్తానికి రోడ్ షోను విజయవంతం చేశారు. అయితే.. చిత్రం ఏంటంటే.. ఒకవైపు ఎన్నికల పోలింగ్ (ఐదో దశ) జరుగుతుండగానే.. ఓ మీడియాకు ఆయన నిలబడే ఇంటర్వ్యూ ఇచ్చారు. నిజానికి కోడ్ అమల్లో ఉండగా.. పైగా సోమవారం ఓవైపు ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేశారు.
ఈ సందర్భంగా.. మోడీ ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపైనా అవినీతి ఆరోపణలు చేశారు. అవినీతి పెరిగిపోయిందని.. 25 ఏళ్లుగా.. ఇక్కడున్న బీజేడీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. అంతేకాదు.. తొలిసారి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడానికి ప్రజలు కోరుతున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. నవీన్ పట్నాయక్ కు ఆస్తులు లేవు. వ్యాపారాలు కూడా లేవు. ఆయన మంత్రివర్గంలోని వారిలో నూ ఒకరిద్దరు తప్ప.. అందరూ సాధారణ నాయకులు.. అయినా కూడా.. ప్రధాని మోడీకి సర్కారులో అవినీతి కనిపించడం గమనార్హం. మొత్తంగా ఏదో ఒక బూచి చూపించి.. బీజేపీని గెలిపించాలన్న తాపత్రయం తప్ప.. నిజాలతో పనిలేదన్న విషయం స్పష్టమైంది.