Begin typing your search above and press return to search.

ప్రధాని మోదీ.. మరో సాహస కృత్యం!

1957 నుంచి ఈ పార్కును సందర్శించిన తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం.

By:  Tupaki Desk   |   9 March 2024 4:49 AM GMT
ప్రధాని మోదీ.. మరో సాహస కృత్యం!
X

ప్రధాని నరేంద్ర మోదీ తన రూటే సపరేటు అని నిరూపిస్తున్నారు. గతంలో ఏ ప్రధానమంత్రి చేయని సాహసాలను ఆయన ఇప్పటికే చేసి చూపించారు. సముద్ర గర్భంలోకి వెళ్లి అలనాటి ద్వారకను దర్శించినా, ల„ý ద్వీప్‌ లో సముద్రంలో సాహస క్రీడలు ఆడినా, జలాంతర్గామిలో సముద్రం అడుగునా పయనించినా, దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన చీతాలను ఫొటోలు తీస్తూ తన కెమెరాలో బంధించినా.. ఇలా మిగతా ప్రధానులకంటే భిన్నంగా నిలిచారు. తద్వారా తన ప్రత్యేకతను చాటుకున్నారు.

ఇప్పుడు కూడా ప్రధాని మరో సఫారీ చేశారు. ఈసారి ప్రపంచ ప్రఖ్యాత పార్కు, ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన అస్సోంలోని కజిరంగా నేషనల్‌ పార్కులో ప్రధాని మోదీ విహరించారు. అక్కడ ఏనుగు ఎక్కి సఫారీ చేశారు.

1957 నుంచి ఈ పార్కును సందర్శించిన తొలి ప్రధాని మోదీనే కావడం విశేషం. మార్చి 9న ఉదయాన్నే ఏనుగు ఎక్కిన మోదీ దానిపై ఉండి కజిరంగా నేషనల్‌ పార్కులో ఖడ్గ మృగాలను, ఇతర జంతువులను వీక్షిస్తూ తన్మయత్వం చెందారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ మార్చి 8న అస్సాంలోని తేజ్‌ పూర్‌ కు విమానాశ్రయానికి చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి ఆయన ప్రత్యేక ఛాపర్‌ లో గోలాఘాట్‌ జిల్లాలోని కజిరంగ జాతీయ పార్కుకు వచ్చారు. ఈ క్రమంలో మార్చి 8న కజిరంగా జాతీయ పార్కులోనే ఆయన నిద్రించారు.

ప్రధాని మార్చి 9న తెల్లవారుజామున నిద్ర లేవగానే అభయారణ్యంలోని సెంట్రల్‌ కొహోరా రేంజ్‌ ను సందర్శించారు. ఏనుగు ఎక్కి కజిరంగా జాతీయ పార్కు అందచందాలను వీక్షించారు. ఆ తర్వాత జీపులో సఫారీ చేశారు. ఈ సందర్భంగా పార్క్‌ డైరెక్టర్‌ సొనాలీ ఘోష్, అటవీశాఖ సీనియర్‌ అధికారులు కజిరంగా జాతీయ పార్కు విశేషాలను ప్రధానికి వివరించారు.

కాగా ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా మార్చి 9న జోర్హట్‌ లో కమాండర్‌ లచిత్‌ బర్ఫుకాన్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. శౌర్యానికి ప్రతీకగా 125 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. అలాగే అస్సోంలో రూ.18 వేల కోట్ల విలువ అయిన కేంద్ర, రాష్ట్ర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.