Begin typing your search above and press return to search.

మోడీనే మూడోస్సారి.. తాజా స‌ర్వే సంచ‌ల‌న వెల్ల‌డి!

కేంద్రంలోని బీజేపీ కూడా మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని తేల్చి చెబుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ప్రముఖ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ స‌ర్వే సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించింది.

By:  Tupaki Desk   |   12 Dec 2023 3:56 PM GMT
మోడీనే మూడోస్సారి.. తాజా స‌ర్వే సంచ‌ల‌న వెల్ల‌డి!
X

2024లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎవ‌రు అధికారంలోకి వ‌స్తారు? ఏ పార్టీ ప్ర‌ధాని పీఠంపై కూర్చుంటుంది? అనే చ‌ర్చ కొన్నాళ్లుగా జ‌రుగుతూనే ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్ప‌డిన 'ఇండియా' కూట‌మి కేంద్రంపై క‌న్నేసిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు.. కేంద్రంలోని బీజేపీ కూడా మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని తేల్చి చెబుతోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ప్రముఖ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ స‌ర్వే సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించింది.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో ప్ర‌స్తుతం ఉన్న బీజేపీనే మ‌రోసారి(మూడోసారి) స్పష్టమైన మెజారిటీతో గెలుపొందే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఫిచ్ రేటింగ్స్ స‌ర్వే అంచనా వేసింది. తద్వారా వరుసగా మూడోసారీ మోడీ త‌న అధికారాన్ని నిలబెట్టుకుంటార‌ని పేర్కొంది. ఇలా మూడోసారి వ‌రుస‌గా ఒక పార్టీ అధికారంలోకి రావ‌డం ఇటీవ‌ల కాలంలో రికార్డుగా మారుతుంద‌ని తెలిపింది. ప‌లితంగా దేశంలో మోడీ తీసుకున్న‌ విధానపరమైన సంస్కరణల పరంపర కొనసాగుతుందని ఫిచ్ పేర్కొంది.

అయితే, వ‌చ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకునే పార్టీకి వచ్చే మెజారిటీ సీట్లు.. సంస్కరణల అజెండాను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఫిచ్ పేర్కొంది. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ 2014లో స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 2019లోనూ గెలుపొంది అధికారం నిలబెట్టుకుంది. పైగా.. 2014 కంటే కూడా.. అధిక సంఖ్య‌లో సీట్ల‌ను సొంతం చేసుకుంది. ఇక‌, 2024 ఏప్రిల్‌-మేలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈసారి కూడా మోడీ ప్రభుత్వమే మళ్లీ ప్రభుత్వ పగ్గాలు చేపడుతుందనేది ఫిచ్‌ తాజా అంచనా స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారింది. దీనిపై 'ఇండియా' కూట‌మి పార్టీలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.