Begin typing your search above and press return to search.

మోడీ అమిత్ షా : ఏపీలో ఆ మాటెత్తలేదెందుకో...!?

దేశంలో గత కొద్ది రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా ఒకే ఒక మాట తారకమంత్రంగా మాట్లాడుతూ వస్తున్నారు.

By:  Tupaki Desk   |   7 May 2024 3:36 AM GMT
మోడీ అమిత్ షా : ఏపీలో ఆ మాటెత్తలేదెందుకో...!?
X

దేశంలో గత కొద్ది రోజులుగా ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా ఒకే ఒక మాట తారకమంత్రంగా మాట్లాడుతూ వస్తున్నారు. అదే మైనారిటీలకు రిజర్వేషన్లు రద్దు అన్నది. అంతదాకా ఎందుకు పొరుగున ఉన్న తెలంగాణాలోనూ అదే మాట మాట్లాడుతూ మోడీ షాలు హోరెత్తించారు. మోడీ అయితే మరి కాస్తా ముందుకు వెళ్ళి మతపరమైన రిజర్వేషన్లు కొనసాగ నివ్వను అని తెలంగాణా గడ్డ మీదనే భీషణ ప్రకటన చేశారు.

అదే మోడీ ఏపీకి వచ్చి రెండు ఎన్నికల సభలలో పాలుపంచుకున్నారు. ఆ రెండు చోట్లా ఆయన ముస్లిం రిజర్వేషన్ల మీద మాట్లాడలేదు సరికదా ఆ ఊసే ఎరగనట్టుగా వ్యవహరించారు. అదే తీరులో దేశ హోం మంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. నిజానికి బీజేపీ ఫిలాసఫీ అది. మతపరమైన రిజర్వేషనలకు బీజేపీ మాతృ సంస్థ ఆరేస్సెస్ అసలు ఒప్పుకోదు..

మత పరమైన రిజర్వేషన్లతో దేశంలో చీలిక వస్తుందని ఆరెస్సెస్ గట్టిగా నమ్ముతుంది. అంతలా బీజేపీ జీవ సిద్ధాంతం అయిన ఆ మాటను నిర్భయంగా గట్టిగా ఏపీ గడ్డ మీద ఎందుకు చెప్పలేకపోయారు అన్నదే అందరిలో కలుగుతున్న ధర్మ సందేహం. రామభక్తులు జగన్ కి ఓటు వేయవద్దు అని అమిత్ షా పిలుపు ఇచ్చారు. అదే నోటితో మైనారిటీ బుజ్జగింపులకు మా మద్దతు ఉండదని ఎందుకు చెప్పలేకపోయారు అని ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల మ్యానిఫేస్టోతో సంబంధం లేకుండా చంద్రబాబు ఏకంగా ముస్లింలకు భారీ నజరానాలు ప్రకటించారు. లక్ష రూపాయల దాకా ఆర్థిక సాయం హజ్ యాత్రీకులకు ఆయన ప్రకటించారు. అలాగే యాభై ఏళ్ళు నిండితే చాలు పెన్షన్ అని కూడా ప్రకటించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయకుండా చూస్తామని కూడా ప్రామిస్ చేశారు.

మరి ఇవన్నీ మోడీ అమిత్ షాలకు తెలియవా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మైనారిటీలను బుజ్జగిస్తున్నారు అని కాంగ్రెస్ మీద విరుచుకుని పడే మోడీ షాలు ఏపీలో ప్రాంతీయ పార్టీలు రెండూ అదే పనిచేస్తున్నా ఎందుకు ఖండించడం లేదు. ఏపీకి వచ్చి ముస్లిం రిజర్వేషన్లు తాము రద్దు చేస్తున్నామని ఎందుకు ప్రకటించడం లేదు అన్న చర్చ వస్తోంది. రిజర్వేషన్ల కోసం బడుగు వర్గాలు ఆశగా చూస్తున్నాయని దేశమంతా చెబుతున్నారు. ఏపీలో ఎందుకు చెప్పడం లేదు అని కూడా అడుగుతున్నారు.

దీనిని బట్టే బీజేపీ ఫిలాసఫీని కూడా పక్కన పెట్టి ఏపీలో ఓట్ల రాజకీయానికి తెర తీస్తోందని అంటున్నారు. టీడీపీకి ఆ కూటమిలో ఉన్న బీజేపీకి కూడా ఓట్లు కావాలని అందుకే కోరి మరీ ఈ ప్రస్తావన చేయలేదని అంటున్నారు.

ఇక దీని మీద సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అయితే చంద్రబాబు ద్వంద్వ నీతిని ఎండగట్టారు.బీజేపీ తీరునూ తప్పు పట్టారు. ఏపీలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయకుండా చూస్తాను అని బాబు ఎలా చెబుతారని దేశవ్యాప్తంగా బీజేపీ రద్దు చేస్తే అది ఏపీకి కూడా వర్తించదా అని ఆయన ప్రశ్నించారు. అలాగే బీజేపీ ఏపీలో గమ్మున ఉండడం వెనక మర్మమేమిటి అన్న ప్రశ్నలూ వస్తున్నాయి.

కొన్ని దాచి మరి కొన్ని మూసి అన్న చందంగా ఏపీలో బీజేపీ పెద్దల ప్రచారం సాగుతోంది అన్న విమర్శలు వస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద మాట్లాడాల్సిన చోట దాని మీద అసలు మాట్లాడలేదు. ముస్లిం రిజర్వేషన్లు విషయంలో మాత్రం నర్మగర్భంగా మాట్లాడకుండా వ్యవహరించారు అన్న విమర్శలు వస్తున్నాయి. అయినా ముస్లిం సమాజానికి ఇవన్నీ తెలియదు అనుకుంటే పొరపాటే అంటున్నారు. చిత్రమేంటి అంటే దేశమంతా నినదించిన ఒక బలమైన స్లోగన్ ఏపీకి రాగానే ఎందుకు మూగబోయింది అన్నదే.