Begin typing your search above and press return to search.

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌- ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌ట‌న‌.. అస‌లేంటిది?

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుదీర్ఘ‌కాలంగా వినిపించిన‌, వినిపిస్తున్న పెద్ద డిమాండ్‌.

By:  Tupaki Desk   |   12 Nov 2023 5:28 AM GMT
ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌- ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌ట‌న‌.. అస‌లేంటిది?
X

ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుదీర్ఘ‌కాలంగా వినిపించిన‌, వినిపిస్తున్న పెద్ద డిమాండ్‌. ఎస్సీల‌కు అందుతున్న రిజ‌ర్వేష‌న్‌ను నేరుగా మాల‌, మాదిగ స‌హా ఉప కులాల‌కు నేరుగా అందించ‌డం కాకుండా.. ఆయా కులాల్లోని జ‌నాభా ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్‌ను అమ‌లు చేయాల‌నేది ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోరుతున్న‌వారి ప్ర‌ధాన డిమాండ్‌. ముఖ్యంగా మాదిగ సామాజిక వ‌ర్గం ఈ డిమాండ్‌ను తెర‌మీదికి తెచ్చింది. కానీ, ఈ వ‌ర్గీక‌ర‌ణ‌ను మాల సామాజిక వ‌ర్గం అనేక రూపాల్లో వ్య‌తిరేకిస్తోంది. దీంతో ఈ విష‌యం మూడున్న‌ర ద‌శాబ్దాలుగా కేవ‌లం డిమాండ్ రూపంలోనే నిలిచిపోయింది.

ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా వెంట‌నే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అనేది ప్ర‌ధాన డిమాండ్‌గా వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. వ‌ర్గీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తిచ్చిన వారికే త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని దీనికోసం ఏర్ప‌డిన ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌కుడు మంద కృష్ణ‌మాదిగ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వ‌హించిన మాదిగ‌ల విశ్వ‌రూప మ‌హాస‌భ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పాల్గొన్నారు. ఎస్సీలుమూడు ద‌శాబ్దాలుగా చేస్తున్న పోరాటం త‌న‌నుక‌దిలించేసింద‌నే ఆయ‌న పేర్కొన్నారు.

ఎస్సీల వ‌ర్గీక‌ర‌ణ‌కు మ‌ద్దతు తెలుపుతున్నాయి. దీనికి సంబంధించి ఓ క‌మిటీని కూడా వేయ‌నున్న‌ట్టు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఈ కేసు సుప్రీంకోర్టువిచార‌ణ‌లో ఉన్నందున తామేమీ మాట్లాడ‌కూడ‌ద‌ని అన్నారు. ఎస్సీల‌వ‌ర్గీక‌ర‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని కూడా మోడీ చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌కుడు మంద కృష్ణ‌ను త‌మ్ముడు అంటూ వ్యాఖ్యానించారు.

సాధ్య‌మేనా?

ఇదిలావుంటే.. అస‌లుఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ సాధ్య‌మేనా.. అనేది ప్ర‌శ్న‌. లేక‌పోతే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఉక్కుమ్మ‌డిగా ఈ అంశాన్ని రాజ‌కీయ ల‌బ్ది కోసం వినియోగించుకుంటున్నారా? అనేది చ‌ర్చ‌. ఎందుకంటే.. ఇప్ప‌టికే న్యాయ స్థానాల్లో ఈ వివాదం రెండు ద‌శాబ్దాలుగా ఉంది. మ‌రో వైపు.. మాల సామాజిక వ‌ర్గం నాయ‌కులు, వ‌ర్గీక‌ర‌ణ‌కు అసలు ఒప్పుకోవ‌డం లేదు. ఈ ప‌రిణామ‌ల నేథ్యంలో అత్యంత కీలక‌మైన ఈ విష‌యంలో మోడీ ఇచ్చిన హామీ ఏమేర‌కు స‌క్సెస్ అవుతుంద‌నేది చూడాలి.