Begin typing your search above and press return to search.

రామసేతు నిర్మించిన ప్రదేశం వద్ద మోడీ...!

ఇందులో భాగంగా ఆదివారం రామేశ్వరంలోని అరుల్మిగు రామనాథస్వామి ఆలయాన్ని ప్రధాని సందర్శించారు. ఈ సందర్భంగా... రుద్రాక్ష మాల ధరించి, అగ్నితీర్థం బీచ్‌ లో పవిత్ర స్నానం చేశారు.

By:  Tupaki Desk   |   21 Jan 2024 8:18 AM GMT
రామసేతు నిర్మించిన ప్రదేశం  వద్ద  మోడీ...!
X

అయోధ్యలోని రామ మందిరంలో రాం లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవానికి మరికొన్ని గంటలే సమయం ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రాణ ప్రతిష్టకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారతదేశంలోని దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా.. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన శనివారం తమిళనాడు చేరుకున్నారు. ఈ క్రమంలో తొలి రోజు పలు ఆలయాలను సందర్శించిన ప్రధాని.. ఆదివారం అరిచల్ మునై పాయింట్‌ ను సందర్శించారు.

అవును... అయోధ్య ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు ప్రధాని మోడీ తమిళనాడులో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం రామేశ్వరంలోని అరుల్మిగు రామనాథస్వామి ఆలయాన్ని ప్రధాని సందర్శించారు. ఈ సందర్భంగా... రుద్రాక్ష మాల ధరించి, అగ్నితీర్థం బీచ్‌ లో పవిత్ర స్నానం చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ.. "ఆలయంలోని ప్రతి భాగంలో కాలాతీత భక్తి ఉంది" అని ట్వీట్ చేశారు.

అంతకుముందు ఉదయం మోడీ ధనుష్కోడి సమీపంలోని రామసేతు నిర్మించిన ప్రదేశం అరిచల్ మునైని సందర్శించారు. ఇక్కడి నుంచే త్రేతాయుగం నాటి రామసేతు ప్రారంభమవుతుంది! మునై పాయింట్‌ ను సందర్శించిన అనంతరం శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను మోడీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆలయ సందర్శనను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.

కాగా... ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠకు ముందు 11 రోజులుగా మోడీ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... నేలపైనే పడుకుంటూ, కొబ్బరి నీరు సేవిస్తూ ఉపవాస దీక్ష చేస్తున్నారు! ఈ క్రమంలోనే దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే తమిళనాట మోడీ ఆధ్యాత్మిక యాత్ర చేస్తోన్నారు.