మోడీ ఫోటో....చెప్పని జవాబులు ఎన్నో !?
టీడీపీ కూటమిలో బీజేపీ ఉంది. కానీ కూటమి విడుదల చేసిన ఉమ్మడి మ్యానిఫేస్టోలో మాత్రం మోడీ ఫోటో లేదు.
By: Tupaki Desk | 1 May 2024 7:22 AM GMTటీడీపీ కూటమిలో బీజేపీ ఉంది. కానీ కూటమి విడుదల చేసిన ఉమ్మడి మ్యానిఫేస్టోలో మాత్రం మోడీ ఫోటో లేదు. ఇది చాలా తమాషాగా ఉంది. బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి ప్రాంతీయంగా ప్రత్యేకంగా మ్యానిఫేస్టో ఉండదని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
కానీ 2014లోనూ బీజేపీ జాతీయ పార్టీగానే ఉంది. ఆనాడు కూటమిలో మోడీ బొమ్మ ఎందుకు కనిపించింది, ఇపుడు ఎందుకు మిస్ అయింది అంటే దానికి చాలా కారణాలు చెబుతున్నారు. మోడీ ఫోటో వేసుకోవద్దని బీజేపీ పెద్దలు అన్నారని టీడీపీ మ్యానిఫేస్టో మీద నమ్మకం లేకనే ఇలా చేశారు అని అంటున్నారు.
ఈ విమర్శను వైసీపీ అధినేత జగన్ కూడా చేశారు. బీజేపీ పెద్దల నుంచి ఫోన్ రావడంతోనే ఆఖరు నిముషంలో ఆయన ఫోటోని పక్కన పెట్టారని కూడా చెబుతున్నారు. ఇది ఒక యాస్పెక్ట్ అయితే మరొకటి వైసీపీ నేతలే ప్రచారం చేస్తున్నారు. అదేంటి అంటే మోడీ ఫోటోతో ఎన్నికల ప్రచారానికి వెళ్తే ముస్లిం మైనారిటీ ఓట్లు తమకు పడవు అన్న కారణంతోనే టీడీపీయే తెలివిగా ఆయన ఫోటోని మిస్ చేసిదని వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్ధి విజయసాయిరెడ్డి అంటున్నారు.
ఇది కూడా లాజిక్ పాయింట్ గానే ఉంది. చిత్రమేంటి అంటే జగన్ మోడీ ఫోటో వద్దని బీజేపీ వారు చంద్రబాబుని ఆదేశించారు అని విమర్శలు చేస్తూంటే అదే పార్టీకి చెందిన కీలక నేత విజయసాయిరెడ్డి బాబు వ్యూహంలో భాగంగానే మోడీ ఫోటో మిస్ అయింది అని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఎందుకు కూటమి మ్యానిఫేస్టో రిలీజ్ కార్యక్రమానికి రాలేదు అన్న చర్చ కూడా మొదలైంది. ఇక వచ్చిన ఏపీ బీజేపీ ఇంచార్జి సిద్ధార్థ్ నాధ్ సింగ్ కూడా మ్యానిఫేస్టోని సైతం ముట్టుకోవడానికి కూడా ఎందుకు ఇష్టపడలేదు అన్నది కూడా మరో చర్చగా ఉంది.
దీనిని బట్టి చూస్తే ఏదో జరుగుతోంది అన్న చర్చ కూడా బయల్దేరింది. టీడీపీ మ్యానిఫేస్టోలో తాము అనుకున్నవి కొన్ని పెట్టమని బీజేపీ కోరిందని అవి ఒక వర్గానికి వ్యతిరేకం కాబట్టి టీడీపీ పెట్టలేదని ప్రచారం సాగుతోంది. దాంతో కూడా మోడీ బొమ్మ పెట్టకుండా అడ్డుకున్నారు అని అంటున్నారు.
ఏది ఏమైనా పేరుకు కూటమి కానీ లుకలుకలు అయితే వేరే లెవెల్ లో ఉన్నాయని అంటున్నారు. మార్చి 16న అంతా కలసి ఒక మీటింగ్ పెట్టారు. ఆ తరువాత ఇప్పటిదాకా ఒక్క మీటింగ్ కూడా పెట్టలేదు. ఏపీలో ఎన్నికలు చూస్త మరో పన్నెండు రోజుల వ్యవధిలో జరగబోతున్నాయి.
మొదట వస్తామని బీజేపీ అగ్ర నేతలు ఇచ్చిన డేట్స్ అన్నీ ఎందుకు క్యాన్సిల్ అయ్యాయి. అసలు వారు ఎపుడు వస్తారు అన్న చర్చ కూడా సాగుతోంది. మే 1 2 తేదీలు అన్నారు ఆ తరువాత 3, 4 తేదీలు అన్నారు. ఇక 7, 8 తేదీలు అని అంటున్నారు కానీ ఆ తేదీలలో తెలనగాణాలో మోడీ పర్యటనలు షెడ్యూల్ చేయబడ్డాయి. ఇక ఏపీ తెలంగాణాలలో ఎన్నికల ప్రచారం మే 11తో ముగుస్తోంది.
అలా చూస్తే చివరి మీటింగ్ కూడా మోడీది తెలంగాణా లోనే ఉంటోంది. దాని అర్ధం చూస్తే కనుక ఏపీలో కూటమి విషయంలో బీజేపీ పెద్దలు లైట్ తీసుకున్నారు అనే అంటున్నారు. కొన్ని అంశాలలో వచ్చిన విభేదాలు కేంద్ర పెద్దలను ఏపీ కూటమి నేతలు కోరిన అంశాలు వాటిని వారు పట్టించుకోకపోవడం వంటివి కూడా ఉన్నాయని చెబుతున్నారు కారణాలు ఏవి అయినప్పటికీ కూటమి పరువు పోయేలా పరిణామాలు అయితే సాగుతున్నాయని అంటున్నారు. కూటమిలో మూడు పార్టీలు పోటీ చేస్తూంటే ఇద్దరు నేతల బొమ్మలతో మ్యానిఫేస్టో రిలీజ్ ఏంటి అన్న చర్చ అయితే వైరల్ గానే సాగుతోంది.