కాంగ్రెస్.. అవుట్ డేటెడ్ ఫోను: ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!
తాజాగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని కాలం చెల్లిన (ఔట్ డేటెడ్) ఫోనుగా తీసిపారేశారు
By: Tupaki Desk | 27 Oct 2023 10:17 AM GMTలోక్ సభ ఎన్నికలకు మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి అధికారం సాధించాలని కేంద్రంలోని అధికార బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలకు పదునుపెడుతున్నారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని కాలం చెల్లిన (ఔట్ డేటెడ్) ఫోనుగా తీసిపారేశారు. ఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో మోదీ మాట్లాడుతూ.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీని ‘కాలం చెల్లిన ఫోన్’తో పోల్చారు. 2014లోనే ప్రజలు అవుట్ డేటెడ్ ఫోన్(కాంగ్రెస్ పార్టీ)ను వదిలేశారన్నారు. పాత ఫోన్ స్థానంలో దేశ గతిని మార్చే తమ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీని కాలం చెల్లిన ఫోనుతో పోల్చిన ప్రధాని మోదీ వ్యంగాస్త్రాలు సంధించారు. కాలం చెల్లిన ఫోన్లలో పనిచేయని స్క్రీన్లపై.. ఎన్నిసార్లు స్వైప్ చేసినా, ఎన్ని బటన్లు నొక్కినా ఫలితం ఉండదన్నారు. దాన్ని రీస్టార్ట్ చేసినా, బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టినా.. చివరకు బ్యాటరీ మార్చినా ఆ ఫోన్లు పనిచేయవని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ప్రధాని ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వం (కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు) కూడా పాత ఫోను మాదిరిగానే ఉండేదని మోదీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో 2014లోనే ప్రజలు అలాంటి కాలం చెల్లిన ఫోన్లను వదిలించుకున్నారని ఆయన గుర్తు చేశారు. తద్వారా ఈ దేశానికి సేవ చేసేందుకు తమకు అవకాశం కల్పించారన్నారు. 2014 కేవలం తేదీ మాత్రమే కాదని.. అదో పెను మార్పు అని ప్రధాని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా సాంకేతిక రంగంలో భారత్ సాధించిన విజయాలను ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. వేగవంతమైన 5జీ టెలిఫోన్ నెట్‌వర్క్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. 5జీని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏడాదిలోపే దేశవ్యాప్తంగా నాలుగు లక్షల 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోగలిగామని వెల్లడించారు. బ్రాడ్ బ్యాండ్ వేగంలో భారత్ గతంలో 118వ ర్యాంక్‌లో ఉండగా.. ఇప్పుడు 43వ ర్యాంక్ కు ఎగబాకిందని గుర్తు చేశారు.
ఇప్పుడు 6జీ దిశగా భారత్ వడివడిగా అడుగులు వేస్తోందని తెలిపారు. 6జీ టెక్నాలజీలో భారత్ ప్రపంచానికి మార్గనిర్దేశంగా నిలుస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇటీవలే గూగుల్.. భారత్ లో పిక్సెల్ ఫోన్ ను తయారు చేయనున్నట్లు ప్రకటించిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. శాంసంగ్ ఫోల్డ్ 5, యాపిల్ ఐఫోన్ 15 ఇప్పటికే దేశంలో తయారవుతున్నాయని వెల్లడించారు. ఇప్పుడు ప్రపంచమంతా మేడ్ ఇన్ ఇండియా ఫోన్లను ఉపయోగిస్తుండటం గర్వంగా ఉందన్నారు.
భారత టెక్ విప్లవంలో యువత పాత్రే కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. అంతరిక్ష రంగంలోనూ భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. తద్వారా 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణాన్ని మోదీ ప్రస్తావించారు. కానీ తమ హయాంలో 4జీని విస్తరించామని తెలిపారు. కానీ తమపై ఒక్క మచ్చా పడలేదన్నారు.