ఎన్నికల వేళ మోడీ తాయిలాలు.. కోట్ల ఓట్లపై కన్ను!
ప్రజలకు ఉచితాలు ఇచ్చి ఓటు వేయించుకునేందుకు తాము సిద్ధంగా లేమని పదే పదే చెప్పే బీజేపీ నాయకులు.. పరోక్షంగా ఉచితాలు ఇచ్చేందుకు రెడీ అయ్యారు
By: Tupaki Desk | 8 March 2024 4:32 AM GMTప్రజలకు ఉచితాలు ఇచ్చి ఓటు వేయించుకునేందుకు తాము సిద్ధంగా లేమని పదే పదే చెప్పే బీజేపీ నాయకులు.. పరోక్షంగా ఉచితాలు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. దేశ వ్యాప్తంగా ఉచితాన్ని అధికారం చేశారు. మరో వారంలో ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో పైకి కనిపించని ప్రధాన ఉచితాలు మైమరిపిస్తున్నాయి. మోడీ కేబినెట్ ఈ ఉచితాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.
దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షలకు పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, దీనికి రెండింతలు ఉన్న పింఛనర్లను లక్ష్యంగా చేసుకుని వారికి 4% డీఏ/డీఆర్‌ని పెంచారు. దీనిని జనవరి నుంచే వర్తింపజేయనున్నారు. వాస్తవానికి ఇలాంటి వాటికి ముందు వచ్చే నెలల నుంచి అమలుకు నిర్ణయం తీసుకుంటారు. కానీ, ఎన్నికల వేళ కావడంతో రెండు నెలలు వెనక్కి వెళ్లి అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల సుమారు 10 కోట్ల ఓట్లు బీజేపీకి సానుకూలంగా మారనున్నాయి.
ఇక, మహిళలను మెరిపించేందుకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద వంటగ్యాస్ సిలిండర్‌పై ప్రస్తుతం ఇస్తున్న రూ.300 రాయితీని మరో ఏడాది పొడిగించారు. దీనివల్ల 10.27 కోట్ల మంది లబ్ధిదారు లకు ఏడాదిలో గరిష్ఠంగా 12 సిలిండర్ల వరకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. అంటే.. ఒక్కొక్క ఇంట్లో మూడు ఓట్లు వేసుకున్నా.. 30 కోట్లకు పైగా ఓట్లు బీజేపీకి సానుకూలంగా మారనున్నాయి.
మరో కీలకమైన విషయం ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిన ఈశాన్య రాష్ట్రాలను కూడా మోడీ సర్కా రు వదల్లేదు. ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమలను ప్రోత్సహించడానికి ‘ఉన్నతి-2024’ పేరుతో రూ.10,037 కోట్ల పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో 8 ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమల ఏర్పాటు సుగమం కానుంది. తద్వారా.. ఉపాధి, ఉద్యోగాలు పెరిగి బీజేపీకి తక్షణ ఓటు రూపంలో భారీ మేలు జరగనుంది.
ఇక, మేధావులను, సాఫ్ట్ వేర్ ఉద్యోగులను ఆకట్టుకునేలా దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) అభివృద్ధి, పరిశోధనల కోసం సమగ్ర వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా.. రూ.10,372 కోట్లతో ‘ఏఐ మిషన్’కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యువతకు శిక్షణ, ఆవిష్కరణ కేంద్రాల ఏర్పాటు, కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయనున్నారు. ఇది.. మేధావులను, యువతను పెద్ద ఎత్తున బీజేపీ వైపు ఆకర్షించే ప్రయత్నం.