Begin typing your search above and press return to search.

ఈ శాఖలతో ఏం చేసుకోవాలి... అసంతృప్తి చాలానే

కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడానికి ఆక్సిజన్ గా మారింది టీడీపీ జనసేన ఎంపీల మద్దతు.

By:  Tupaki Desk   |   11 Jun 2024 9:50 AM GMT
ఈ శాఖలతో ఏం చేసుకోవాలి... అసంతృప్తి చాలానే
X

కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడానికి ఆక్సిజన్ గా మారింది టీడీపీ జనసేన ఎంపీల మద్దతు. మొత్తం 18 మంది ఎంపీలు ఎన్డీయేకు సరైన సమయంలో మద్దతుగా నిలిచారు. దీంతోనే మ్యాజిక్ ఫిగర్ కి ఎన్డీయే చేరువ అయింది.

అలాంటి నేపధ్యంలో ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి కొలువు తీరిన క్రమంలో ఏపీకి విశేషమైన ప్రాధాన్యత ఉంటుందని అంతా ఆశించారు. మామూలుగా అయితే ఏపీకి కనీసంగా అయిదారు మంత్రి పదవులు ఇస్తారని కీలకమైన శాఖలు కట్టబెడతారని కూడా అంతా అనుకున్నారు.

జలశక్తి, గ్రామీణాభివృద్ధి, టూరిజం, భారీ పరిశ్రమలు వంటి శాఖలు ఏపీకి ఇస్తారు అని కూడా తలచారు. కానీ మోడీ మంత్రివర్గంలో ఏపీ నుంచి మూడు మంత్రి పదవులు ఇచ్చారు. అందులో కూడా శాఖల కేటాయింపు చూసిన వారికి ఇదేమిటి అని అనిపించింది.

యువకుడు విద్యావంతుడు అయిన రామ్మోహన్ నాయుడుకి క్యాబినెట్ మంత్రిగా చాన్స్ ఇచ్చారు. కానీ ఆయనకు పౌర విమాన యాన శాఖ కేటాయించారు. ఈ శాఖను ఏమి చేసుకుంటారని ఇపుడు ఏపీ ప్రజానీకం అనుకునే పరిస్థితి ఉంది. గతంలో అంటే 2014 - 2018 మధ్య కాలంలో సీనియర్ లీడర్ అయిన అశోక్ గజపతి రాజుకి ఇదే శాఖ ఇచ్చారు. అయితే ఆనాడు ఈ శాఖ వల్ల ఏపీకి ఒరిగింది ఏమీలేదని అంటున్నారు.

కానీ ఇప్పటికే చాలా విమానాశ్రయాలు ప్రైవేటీకరించబడ్డాయని గుర్తు చేస్తున్నారు. ఈ శాఖ వల్ల రాష్ట్రానికి పెద్దగా ఉపయోగం లేదని అంటున్నరు. దీని వల్ల ఏపీ గ్రోత్ ఇంజన్ గా మారే సీన్ ఉండదని అంటున్నారు.

అలాగే గుంటూరు పార్లమెంటు నుంచి గెలుపొందిన ఎన్నారై అయిన మరో ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఇది కీలకమైన శాఖ అయినప్పటికీ ఆయన కేవలం సహాయ మంత్రి మాత్రమే. ఆ శాఖ కేబినెట్ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్‌ ఉన్నారు. ఏ నిర్ణయం అయినా చౌహాన్ చేయాలి తప్ప చంద్రశేఖర్ ఏమీ చేయలేరు అని అంటున్నారు.

ఇక ఏపీ బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఇచ్చారు. ఈయన కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకొలేరు. ఎందుకంటే కేవలం సహాయ మంత్రి కాబట్టి. పైగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం ఖాయం కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ఆయన ఈ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోకపోవచ్చు అనే అంటున్నారు.

మొత్తం మీద చూస్తే ఏపీకి మంచి శాఖలు అయితే ఇవ్వలేదు అన్న అసంతృప్తి జనాలలో ఉంది. ఏపీకి అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఇచ్చి ఉంటే అమరావతి రాజధాని బ్రహ్మాండంగా తయారు అయ్యేదని అలాగే ఏపీలో ఉన్న సెకండ్ గ్రేట్ సిటీలను అభివృద్ధి చేసుకునే వీలు ఉండేదని అంటున్నారు.

ఏపీ పదేళ్ళుగా విభజన గాయాలతో ఇబ్బందులు పడుతోందని అటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సరైన శాఖలు లభిస్తే ఎవరితోనూ పని లేకుండా నేరుగా నిధులు తెచ్చుకునే వెసులు బాటు ఉండేదని అంటున్నారు. మరి ఏపీ విషయంలో కేంద్రం ఇలా చేయడం పట్ల చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతానికి ఇంతే అని సరిపెట్టుకోవాల్సిందే. రానున్న రోజులలో విస్తరణ జరిగి మరి కొందరికి అవకాశం లభిస్తే అపుడైనా మంచి శాఖలు దక్కుతాయేమో అని ఆశగా ఎదురుచూడాల్సిందే అని అంటున్నారు.