మోడీ భయపడుతున్నారా? వ్యూహాత్మకంగా దూసుకెళుతున్నారా?
ఉన్నట్లుండి మోడీ మాష్టారి నోటి నుంచి ఘాటు వ్యాఖ్యల ప్రవాహం జోరుగా సాగుతోంది.
By: Tupaki Desk | 26 April 2024 5:11 AM GMTపదేళ్ల పాటు దేశానికి ప్రధానమంత్రిగా వ్యవహరించిన వ్యక్తిని తక్కువగా అంచనా వేయటం దేనికి నిదర్శనం? అర్థం లేని వాదనలతో మోడీ బలాన్ని బలహీనతగా చూపించటం ఒక ఎత్తు. మోడీ మాష్టారు బలహీనపడ్డారంటూ తమకు తాము సర్దిచెప్పుకోవటమే తప్పించి.. జనబాహుళ్యం ఏమనుకుంటోంది? వారి సెంటిమెంట్ ఎలా ఉంది? దేశంలో రాజకీయ గాలి ఏ రీతిలో వీస్తోందన్న విషయంపై రాజకీయ పార్టీల అంచనా ఎలా ఉంది? ప్రజల ఆలోచనల్ని చెప్పే జర్నలిస్టులు మోడీని సరిగా అర్థం చేసుకుంటున్నారా? ఆయన వ్యూహాన్ని పసిగడుతున్నారా? రాజకీయ పార్టీల మాదిరే జర్నలిస్టులు సైతం మోడీ ఎత్తుగడల్ని అర్థం చేసుకోలేక చేతులెత్తేస్తున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నలుగా మారాయి.
ఉన్నట్లుండి మోడీ మాష్టారి నోటి నుంచి ఘాటు వ్యాఖ్యల ప్రవాహం జోరుగా సాగుతోంది. పదేళ్లు ప్రధానమంత్రిగా వ్యవహరించిన నరేంద్ర మోడీని.. ఆయన శక్తిసామర్థ్యాల్ని తక్కువగా అంచనా వేయటం.. ఆయన బలాన్ని అర్థం చేసుకునే విషయంలో జరుగుతున్న తప్పులు మోడీ అండ్ కోకు వరంగా మారుతున్నాయని చెప్పాలి. మోడీ బలహీనపడ్డారని.. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక గాలి వీస్తోందని.. ఈ కారణంతోనే మోడీ మాష్టారు నోటిమాటల్లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందన్న వాదనల్ని వినిపిస్తున్నారు.
అయితే.. ఈ వాదనలో నిజం ఎంత? అన్నది చూస్తే.. తాజా ఎన్నికల వేళ ఒక మూడ్ ను సెట్ చేసే విషయంలో మోడీ మాష్టారు సక్సెస్ అయ్యారు. తనకు ధీటుగా నిలిచే నాయకుడు లేని లోటును తెలివిగా ఎత్తి చూపుతున్నారు. అంతేకాదు.. ప్రత్యర్థుల ఫోకస్ సరైన అంశాల మీద కాకుండా.. వారు ప్రస్తావించే ప్రతి అంశం కారణంగా ఆయా వర్గాల్లో మండిపాటు వ్యక్తమయ్యేలా చేస్తున్నారు. ఒక విధంగా ప్రత్యర్థులపై మోడీ మాష్టారు విసిరిన ట్రాప్ లో రాజకీయ పార్టీలు చిక్కుకున్నాయి.
పదేళ్ల వ్యవధిలో మోడీ సర్కారు చేసిన అప్పుల లెక్కలేంటి? వాటిని వేటి కోసం ఖర్చు చేశారు? విజయవంతంగా పాలన చేస్తే.. అవినీతిరహితంగా పాలన సాగితే.. అప్పుల కుప్పలా భారత్ ఎందుకు మారుతోంది? అన్న సూటి ప్రశ్నలను రాజకీయ పార్టీలు సంధించకుండా చేయటంలో మోడీ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్లటానికి కారణం పదేళ్లు మోడీ ప్రభుత్వం చేసింది ఎంతోకొంత అయితే.. దానికి సంబంధించిన బేస్ మెంట్ ను గత ప్రభుత్వాలు చేశాయన్న విషయాన్ని మర్చిపోకూడదు.
ఒక వాహనం వేగంగా దూసుకెళుతుందంటే.. ఆ వాహన సామర్థ్యం మాత్రమే కాదు.. ఆ వాహనం నడిచే రోడ్డు కూడా కీలకమనే విషయాన్ని మర్చిపోకూడదు. చాలా సందర్భాల్లో నడిపే వాహనం గురించి మాత్రమే చర్చ జరుగుతుంది. కానీ.. ఆ వాహనం వేగంగా దూసుకెళ్లటానికి కారణమైన మంచి రోడ్డును ప్రస్తావించటం మర్చిపోతారు. వాహనాన్ని మాత్రమే హైలెట్ చేయాలనుకున్న వారు.. తమకు అవసరమైన మైలేజీ కోసం అలాంటి ఎత్తుగడలోకి వెళ్లినప్పుడు.. తాము వేసిన రోడ్డు గురించి.. సదరు వాహనం ఆ రేంజ్ లో దూసుకెళ్లటానికి కారణమైన రోడ్డు తమ ప్రభుత్వంలోనిదే అన్న విషయాన్ని ప్రజలకు గుర్తు చేసే విషయంలో పార్టీలు తప్పు చేస్తే అందుకు ఎవరిని నిందించాలి? అన్నది ప్రశ్న.
ఇటీవల కాలంలో మోడీ నోటీ నుంచి వస్తున్న ఘాటు వ్యాఖ్యల మర్మం.. తాను టార్గెట్ గా పెట్టుకున్న 400 సీట్ల సాధనే. తమకు పట్టున్న రాష్ట్రాలతో పాటు.. తాము బలంగా లేని రాష్ట్రాల్లో ఓట్లను.. సీట్లను సొంతం చేసుకోవటానికి వీలుగా.. తమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లటం ద్వారా.. మిగిలిన రాజకీయ పార్టీలను తన ట్రాప్ లో పడాలన్న ఎత్తుగడలో మోడీ సక్సెస్ అయ్యారని చెప్పాలి. దీన్ని గుర్తించటంలో మిగిలిన పార్టీలు తప్పులు చేస్తున్నాయి. ఆయన ఘాటు వ్యాఖ్యలు ఆత్మరక్షణలో చేస్తున్నారన్న భావనలో ఉన్నారే తప్పించి.. తన లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నారన్న అంశాన్ని మిస్ అవుతున్నట్లుగా చెప్పాలి. ఇప్పటికైనా పార్టీలు తమ తప్పుల్ని సరిచేసుకుంటాయో లేదో చూడాలి.