అటు నితీష్ ఇటు చంద్రబాబు...మోడీకి బడ్జెట్ కత్తి మీద సాము ?
కేంద్రంలో నరేంద్ర మోడీ ఎన్నడూ చూడని విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నారు.
By: Tupaki Desk | 6 July 2024 2:30 PM GMTకేంద్రంలో నరేంద్ర మోడీ ఎన్నడూ చూడని విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నారు. ఒక వైపు ప్రత్యేక హోదా ఇవ్వమని జేడీయూ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ అల్టిమేటం లాంటిదే జారీ చేశారు. అది కనుక వీలు కాకపోతే ఏకంగా లక్షా పాతిక వేల కోట్ల అతి పెద్ద ఆర్ధిక ప్యాకేజి ఇవ్వమని కూడా మరో షరతు పెట్టారు. జేడీయూకు 12 మంది ఎంపీలు ఉన్నా లోక్ జన్ శక్తి పార్టీ మాజీ సీఎం మాజీ పార్టీకి కలుపుకుని మరో అయిదు ఎంపీలు ఉన్నారు. ఇలా చూస్తే 17 మంది ఎంపీలతో జేడీయూ ఎన్డీయే ప్రభుత్వాన్ని పరీక్షిస్తోంది.
ఇక మూడు రోజుల పాటు ఢిల్లీ టూర్ వేసిన చంద్రబాబు ప్రత్యేక హోదా అన్న మాట వాడలేదు కానీ ఆయన కూడా భారీ ఆర్ధిక ప్యాకేజీ ని కేంద్రం నుంచి కోరుతున్నారు అని తెలుస్తోంది. అది అన్నీ కలుపుకుని లక్ష కోట్ల రూపాయల దాకా ఉండొచ్చు అని అంటున్నారు. ఈ మేరకు ఆర్ధిక ప్యాకేజీ ఇస్తే తప్ప ఏపీ అభివృద్ధి పధంలో సాగేలా లేదు అని చంద్రబాబు కేంద్ర పెద్దలకు నివేదించినట్లుగా తెలుస్తోంది.
ఇందులో యాభై వేల కోట్ల రూపాయల దాకా అమరావతి రాజధానికే నేరుగా నిధులు కోరినట్లుగా తెలుస్తోంది. అలాగే పోలవరం ప్రాజెక్టుకు అర్జెంటుగా 12 వేల కోట్ల రూపాయలు ఇతర ప్రాజెక్టులకు కూడా భారీ మొత్తాలు కలుపుకుని లక్ష కోట్లు ఉండాలని బాబు సీఎం హోదాలో కేంద్రానికి వినతి చేసినట్లుగా ఉంది.
ఇక్కడ తేడా ఏంటి అంటే నితీష్ కుమార్ కాస్తా డిమాండ్ చేసే లెవెల్ లో కోరుతున్నారు. చంద్రబాబు కేంద్ర పెద్దలను స్మూత్ గా కోరుతున్నారు. అంతే మిగిలినది అంతా సేం టూ సీం అని అంటున్నారు. ఈ నిధులు ఇవ్వాలీ అంటే కేంద్రం ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే కేంద్రం వద్దా నిధుల సమస్య ఉంది. ఏకంగా ఒ150 వేల లక్షల కోట్ల దాకా అప్పు కేంద్రం చేసి ఉంది. అందులో లక్ష కోట్ల రూపాయల దగ్గరగా పదేళ్లలోనే చేసినా అప్పుగా ప్రచారం లో ఉన్న మాట.
ఇక కేంద్ర బడ్జెట్ అయితే ఇరవై లక్షల దాకా ఉంటుంది. అందులో బీహార్ కి లక్షా పాతిక వేల కోట్ల ఆర్ధిక ప్యాకేజి ఏపీకి లక్ష కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వాలంటే కేంద్ర బడ్జెట్ ఏ మాత్రం అవకాశం ఇస్తుందో తెలియదు. ఒకవేళ అనుకున్న విధంగా ఆర్ధిక ప్యాకేజి ఇవ్వకపోతే జేడీయూ టీడీపీ ఏమి చేస్తాయన్నది కూడా ఆలోచించాల్సి ఉంది.
మొత్తం మీద కేంద్ర బడ్జెట్ ని ఈ నెల 22 లేదా 23వ తేదీలలో ప్రవేశపెడతారు అని అంటున్నారు. ఈ బడ్జెట్ లో బీజేపీ ప్రయార్టీలు వేరేగా ఉన్నాయి. అయితే ఎన్డీయే ప్రభుత్వానికి ప్రాణ వాయువుని ఇస్తున్న టీడీపీ జేడీయూ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుకోక పోతే ఆగస్ట్ సంక్షోభం కేంద్రంలో తప్పేట్లు లేదు అని అంటున్నారు. ఇవన్నీ గమనించిన మీదటనే బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది అని కామెంట్స్ చేస్తున్నారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఏపీ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ మీద గంపెడు ఆశలు పెట్టుకుంది. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఉదారంగా నిధులను కేటాయిస్తే దానిని బట్టి రాష్ట్ర బడ్జెట్ సంగతి ఒక కొలిక్కి తేవాలనుకుంటోంది. మొత్తానికి మోడీకి ఈసారి బడ్జెట్ కత్తి మీద సాముగా మారుతోంది అని అంటున్నారు.