మోడీ నోట .. ఆదానీ, అంబానీ మాట !
‘’కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఆదానీ, అంబానీలను విమర్శించింది. ఎన్నికలు రాగానే ఆ విమర్శలు అన్నీ ఆగిపోయాయి.
By: Tupaki Desk | 8 May 2024 9:22 AM GMT‘’కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఆదానీ, అంబానీలను విమర్శించింది. ఎన్నికలు రాగానే ఆ విమర్శలు అన్నీ ఆగిపోయాయి. వారిద్దరి నుండి కాంగ్రెస్ పార్టీ ఎంత తీసుకుంది ?’’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సంతల వ్యాఖ్యలు చేశాడు. మోడీ నోట ఆదానీ, అంబానీ పేర్లు రావడం అందరినీ ఆశ్చర్య పరుస్తున్నది. వేములవాడ పర్యటనలో భాగంగా నిర్వహించిన బహిరంగసభలో మోడీ పై వ్యాఖ్యలు చేశారు.
ఆదానీతో మోడీకి ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. ప్రధానమంత్రి హోదాలో వివిధ దేశాల పర్యటనలకు తనతో తీసుకెళ్లి అతనికి కాంట్రాక్టులు ఇప్పించారన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీలంక సంక్షోభంలో ఆదాని విద్యుత్ కాంట్రాక్టుల వ్యవహారం, ఆస్ట్రేలియా నుండి ఆదానీకి చెందిన బొగ్గు దిగుమతి చేసుకోవాలన్న కేంద్రం ఉత్తర్వులు దుమారం రేపాయి. ఇక అంబానీతోనే బీజేపీ, మోడీ బంధం తక్కువేం కాదు. మరి సార్వత్రిక ఎన్నికల కీలక సమయంలో మోడీ వారి పేర్లు బయటకు లాగడం వెనక వ్యూహం ఏమిటన్నది పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
కాంగ్రెస్ నేతల ఇళ్ల నుండి బయటపడుతున్న గుట్టలకొద్దీ డబ్బు గురించి సమాధానం చెప్పాలంటూ మోడీ నిలదీశారు. బీజేపీకి నేషన్ ఫస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఫ్యామిలీ ఫస్ట్ అని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను అవినీతే కలుపుతోందని, కాంగ్రెస్‌పై ఓటుకు నోటు ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం స్కామ్‌పై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
ఇక అదే సమయంలో మాజీ ప్రధాని గురించి కూడా మోడీ ప్రస్తావనకు తేవడం విశేషం. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావును కాంగ్రెస్ అవమానించిందని, పీవీ భౌతికకాయాన్ని పార్టీ ఆఫీస్‌లోకి అనుమతించలేదని, పీవీకి బీజేపీ ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించిందని మోదీ అన్నారు.