ఎర్రకోట నుంచి మోడీ మాట.. మందులా పని చేసిందా?
గతానికి భిన్నమైన పరిణామాలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి.
By: Tupaki Desk | 17 Aug 2024 8:30 AM GMTగతానికి భిన్నమైన పరిణామాలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. ఎవరు అవునన్నా కాదన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొన్ని విషయాల్లో ప్రదర్శిస్తున్న తీరు ప్రజల్లోఆయన ఇమేజ్ ను అంతకంతకూ పెంచేలా చేస్తోంది. కొంతమంది మేథావులు.. కొన్ని వర్గాలకు చెందిన వారు మోడీని.. ఆయన తీరును తప్పుపడుతున్నా.. సింహభాగం ప్రజలు మాత్రం మోడీ నాయకత్వ అవసరాన్ని నొక్కి చెబుతున్న పరిస్థితి. ఈ కారణంగానే ముచ్చటగా మూడోసారి కేంద్రంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాల గురించి ఎలాంటి ప్రకటన చేయని మోడీ.. అందుకు భిన్నంగా పంద్రాగస్టున జాతిని ఉద్దేశించి ఎర్రకోట నుంచి ప్రసంగించిన సమయంలో బంగ్లాదేశ్ అంశాన్ని.. ఆ దేశంలో మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు పెరటంపై ఆందోళన వ్యక్తం చేయటం తెలిసిందే.
బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువుల భద్రత విషయంలో 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనలో ఉన్నారని.. బంగ్లాదేశ్ శ్రేయస్సును నిరంతరం ఆశించే భారత్ అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బంగ్లాలో మైనార్టీలు.. హిందువులు సురక్షితంగా ఉండాలని కోరుకుంటుందని పేర్కొన్నారు. మతం ఏదైనా కావొచ్చు.. మనుషులంతా ఒక్కటేనని.. హక్కులు అందరికీ సమానమేనని.. ప్రజలంతా సమయమనం పాటించాలని పిలుపునివ్వటం తెలిసిందే. ఎర్రకోట నుంచి మోడీ నోటి వచ్చిన మాటల ఎఫెక్టు గంటల వ్యవధిలోనే చోటుచేసుకోవటం గమనార్హం.
గురువారం ఉదయం ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన దానికి ఫలితంగా శుక్రవారంఉదయానికి బంగ్లాదేశ్ ప్రభుత్వ చీఫ్ అడ్వాజయిర్ గా ప్రమాణ స్వీకారం చేసిన 84 ఏళ్ల నోబెల్ గ్రహీత యూనస్ తనకు ఫోన్ చేసిన విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీసోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించటం గమనార్హం. బంగ్లా తాత్కాలిక సారథి పదవిని చేపట్టిన తర్వాత యూనస్ ప్రధానమంత్రి మోడీకి ఫోన్ చేసింది లేదు. అందుకు భిన్నంగా శుక్రవారం ఆయన ఫోన్ చేయటంతో పాటు.. తమ దేశంలోని హిందువులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చినట్లుగాపేర్కొనటం గమనార్హం.
బంగ్లాదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై తామిద్దరం మాట్లాడుకున్నామని.. బంగ్లాదేశ్ లోని హిందువులు.. మైనార్టీలకు భద్రత కల్పిస్తామని తనకు హామీ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల వేళ.. ఉభయ దేశాలకు చెందిన అధినేతలు ఫోన్ లో మాట్లాడుకోవటం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో.. మోడీ నోటి నుంచి వచ్చే మాట ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందన్న విషయం తాజా పరిణామంతో మరోసారి స్పష్టమైందన్న మాట వినిపిస్తోంది.