వాళ్లతో మనకు పోలికేంటి... మోడీ కీలక వ్యాఖ్యలు!
తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పందించిన ఆయన... ఈ సందర్భంగా ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 22 Dec 2023 6:10 AM GMTభారత్ లో అభివృద్ధి అద్భుతంగా జరుగుతుందని.. ఆర్థిక వృద్ధి బాగుందని.. అవినీతి, నిరుద్యోగం వంటి సవాళ్లే లేవని.. అందువల్లే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ గుర్తింపు సాధించిందని చెబుతున్నారు నరేంద్ర మోడీ. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పందించిన ఆయన... ఈ సందర్భంగా ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఆర్ధిక వృద్ధిలో చైనాతో పోల్చడం సరికాదని తెలిపారు.
అవును... ఆర్థిక వృద్ధి విషయంలో భారత్ ను చైనాతో పోల్చడాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ వ్యతిరేకించారు. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశాన్ని చైనాలాంటి దేశంతో ఎలా పోలుస్తారని అన్నారు. ఈ సమయంలో... మన పొరుగున ఉన్న చైనా ప్రజాస్వామ్య దేశం కాదని, అక్కడ నియంతృత్వ పాలన ఉందని ప్రధాని మోడీ విమర్శించారు. ఇదే సమయంలో ఈ దేశంలో నిరుద్యోగం, అవినీతి బలంగా ఉందనే విమర్శలకు ఖండించారు.
అందులో భాగంగా... అవినీతి, నిరుద్యోగం వంటి సమస్యలే ఉంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ గుర్తింపు సాధించేది కాదని అన్నారు. ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడేటప్పుడు భారత్ ను ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే సముచితంగా ఉంటుంది తప్ప... ప్రజాస్వామ్య పాలన లేని పొరుగుదేశం చైనాతో పోల్చడం సరికాదని నొక్కి చెప్పారు.
ఇదే క్రమంలో... భారత్ లో నైపుణ్యాల అంతరం లేదని చెప్పేందుకు ఇదే సరైన ఉదాహరణ అంటూ... ప్రపంచ స్థాయి కంపెనీల్లో భారత సంతతి వ్యక్తులు సీఈవో హోదాల్లో ఉన్న విషయాన్ని మోడీ చెబుతుండటం గమనార్హం. ఇదే సమయంలో... భారత్ లో కొన్ని వర్గాలపై వివక్ష చూపుతున్నారనే వాదన బలంగా వినిపిస్తున్న అంశంపైనా మోడీ స్పందించారు. ఆ వాదనను తోసిపుచ్చే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా... భారత్ లోని మైనార్టీ వర్గాలపై వివక్ష గురించి స్పందించిన మోడీ... భారతీయ సమాజం ఏ మతం, మైనార్టీ వర్గంపై వివక్ష చూపటం లేదని చెప్పుకొచ్చారు.