‘ఈడీ’లో నేతల కేసులు 3 శాతమేనట..? పెద్ద మాటే..
పదేళ్లలో ఎన్నడూ మీడియా ముందుకు రాని ప్రధాని.. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
By: Tupaki Desk | 12 April 2024 12:30 PM GMTమహారాష్ట్ర నుంచి మొదలుకొని పశ్చిమ బెంగాల్ వరకు.. తమిళనాడు నుంచి ఢిల్లీ దాక.. జార్ఱండ్ నుంచి రాజస్థాన్ దాక.. మోదీ ప్రధానిగా ఉన్న గత పదేళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు ఎదుర్కొన్న నాయకులు ఉన్నారు. తెలంగాణలో కవిత.. ఢిల్లీలో అర్వింద్ కేజ్రీవాల్ వంటివారు జైలు పాలయ్యారు. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కటకటాలు లెక్కపెడుతున్నారు. ఇంకా పలువురు నాయకులు కూడా సీబీఐ, ఈడీ, ఐటీ దాడులకు గురయ్యారు. అయితే, ఈడీ కేసులకు సంబంధించి మోదీ మాత్రం కొత్త లెక్క చెప్పారు.
3 శాతంలోనే అంతమంది నేతలా..?
పదేళ్లలో ఎన్నడూ మీడియా ముందుకు రాని ప్రధాని.. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. బీజేపీయేతర రాజకీయ నేతలనే దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని కొందరు తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని తప్పుబట్టారు.
తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఈడీ చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈడీ దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసుల్లో 3 శాతం వాటికే రాజకీయాలతో సంబంధం ఉందని.. మిగతా 97 శాతం అవినీతి అధికారులు, నేరగాళ్లకు సంబంధించినవేనని వెల్లడించారు. అయితే, సత్యేందర్ జైన్, మనీశ్ సిసోడియా వంటి ఢిల్లీ అధికార పార్టీ ఆప్ కీలక నేతలు సహా పదుల సంఖ్యలో నాయకులు జైలు పాలైన నేపథ్యంలో ఈడీ కేసుల్లో 3 శాతం మాత్రమే రాజకీయపరమైనవా? అనే ప్రశ్న వస్తోంది. అంతేకాదు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈడీ కేసులు ఎదుర్కొన్న నాయకులు ఎవరబ్బా? అనే ప్రశ్న కూడా ప్రతిపక్షాల నుంచి రావడం ఖాయం.
బీజేపీలో చేరితే కేసులుండవ్?
తాను గతంలో ఉన్న పార్టీ నుంచి బీజేపీలో చేరానని.. దీంతో తనపై
దర్యాప్తు సంస్థల దాడులు ఆగిపోయాయనని మహారాష్ట్రకు చెందిన ఓ నాయకుడు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి బలం చేకూర్చేలా దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ విపక్షాలు ఆరోపణలు చేశఆయి. అయితే, వీటికి మోదీ గట్టిగా బదులిచ్చారు. అవినీతిపరులపై కఠిన చర్యలు చేపట్టేలా తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని చెప్పుకొచ్చారు.
పదేళ్లలో 10 కోట్ల మంది అనర్హులపై వేటు
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి నిర్మూలనకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పిన మోదీ.. గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాల్లో ఇంటర్వ్యూల రద్దు.. లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలు అందేలా నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ రూపకల్పన ద్వారా దాదాపు 10 కోట్ల మంది నకిలీ లబ్ధిదారుల పేర్లను తొలగించినట్లు పేర్కొన్నారు. తద్వారా రూ.22.75లక్షల కోట్లు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడినట్లు తెలిపారు.
కొసమెరుపు: మోదీ అధికారంలోకి వచ్చింది 2014లో. అంతముందు ఈడీ అటాచ్ చేసుకున్న ఆస్తులు విలువ రూ.25వేల కోట్లు. ఈ పదేళ్లలో మోదీ అధికారంలో ఉండగా ఆ మొత్తం రూ.లక్ష కోట్లు. ఈ లెక్కలు మోదీనే స్వయంగా చెప్పారు. అయితే, ఇందులో అధిక శాతం ప్రతిపక్ష నేతలకు చెందినవే. దీనిపై ఆయనం ఏం మాట్లాడతారో?