నీళ్ల మళ్లింపులో అవినీతి ఏంటి మోడీ సర్!!
తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న ప్రధాన మంత్రి.. బీజేపీ అభ్యర్థుల పక్షాన వివిధ సభల్లో పాల్గొంటున్నారు.
By: Tupaki Desk | 27 Nov 2023 4:17 AM GMTప్రాజెక్టులు కట్టారు.. అవినీతికి పాల్పడ్డారు.. కాంట్రాక్టులు ఇచ్చారు.. అవినీతి చేశారు.. దోచుకున్నారు-దాచుకున్నారు.. అంటే ఒక అర్థం ఉంటుంది. కానీ.. ప్రాజెక్టులు కట్టి నీళ్లు మళ్లించి.. అవినీతికి పాల్పడ్డారంటూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొత్త భాష్యం చెప్పుకొచ్చారు. నిజానికి ప్రాజెక్టుల నిర్మాణంలో ఎక్కువకో తక్కువో కాంట్రాక్టులు ఇవ్వడం.. తన వారికి కట్టబెట్టడం ద్వారా.. అవినీతి పాల్పడిన నాయకులు ఉంటే ఉండి ఉండవచ్చు. కానీ, కట్టిన ప్రాజెక్టుల్లో నీళ్లు పారించడంలో అవినీతి ఏంటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. తాజాగా మోడీ చేసిన వ్యాఖ్యల అంతరార్థం ఏంటో ఆయనకే తెలియాలని అంటున్నారు పరిశీలకులు.
తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న ప్రధాన మంత్రి.. బీజేపీ అభ్యర్థుల పక్షాన వివిధ సభల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తాజాగా జరిగిన తూప్రాన్ బీజేపీ విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై సీఎం కేసీఆర్ గెలవలేకే.. ఓటమి భయంతో వేరే చోట పోటీ చేస్తున్నారని విమర్శించా రు. గతంలో రాహుల్ గాంధీ కూడా ఇలానే పోటీ చేశారని, ప్రజలకు కలవని ముఖ్యమంత్రి మనకి అవసరమా, ఫామ్ హౌస్ లో పడుకునే ముఖ్యమంత్రి మనకి అవసరమా అని ప్రశ్నించారు.
పనిలో పనిగా.. ప్రాజెక్టులు కట్టి నీళ్లు మళ్లించి.. కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని.. బీజేపీప్రభుత్వం ఏర్పడగానే తాము అవినీతిని వెలికి తీసి కేసీఆర్‌ను జైలుకు పంపిస్తామని వ్యాఖ్యానించారు. అయితే.. ఇక్కడ ప్రధాని మోడీ తప్పుగా అర్ధం చేసుకున్నారో.. లేక స్క్రిప్టు రాసిచ్చిన వారే తప్పుగా అన్వయించారో తెలియదు కానీ.. మొత్తానికి ఈ కామెంట్ అయితే బూమరాంగ్ అయిపోయింది. మోడీ మాటల్లోనే వాస్తవం ఏంటో బయట పడింది. ప్రాజెక్టులు కట్టించింది.. రైతుల కోసం.. నీళ్లను మళ్లించడం కోసమే కదా! దీనిలో తప్పేముంది అనేది నెటిజన్ల మాట.
అంతేకాదు.. అవినీతి ఎక్కడ జరిగిందో.. ఎంత జరిగిందో తేల్చేందుకు .. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అవసరమా? అనేది కూడా నెటిజన్ల మాట. ఏదేమైనా..కేసీఆర్‌పై బురద జల్లాలనే ప్రయత్నాల్లో బీజేపీ ఒకింత తడబడుతోందనే వాదన వినిపిస్తోంది. ఇటీవల కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా.. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిపై విచారణ జరుపుతామన్నారు. దీనిపైనా పెదవి విరుపులే కనిపించాయి. అవినీతి విషయంపై మీరా మాట్లాడేదని.. ప్రతిపక్ష నాయకులు సైతం ప్రశ్నించారు.