Begin typing your search above and press return to search.

గాంధీపై మోడీ సంచలన వ్యాఖ్యలు... కౌంటర్స్ & వీడియో వైరల్!

అవును... మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా మన జాతిపిత మహాత్మ గాంధీపై సినిమా తీసేవరకు ఆయన గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు అని అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   30 May 2024 5:14 AM GMT
గాంధీపై మోడీ సంచలన వ్యాఖ్యలు... కౌంటర్స్  & వీడియో వైరల్!
X

సార్వత్రిక ఎన్నిక సమరంలో ఇంకా చివరిదశ పోలింగ్ మాత్రమే మిగిలి ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఆరు దశల్లో పోలింగ్ పూర్తవ్వగా.. చివరిదైన ఏడో దశ పోలింగ్ ఈ జూన్ 1న జరగనుంది. ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్నారు. ఈ దశలో ఆయనతో పాటు 598 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు.

ఇందులో భాగంగా... మొత్తం ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 57 లోక్‌ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్- 13, పంజాబ్- 13, బిహార్- 8, పశ్చిమ బెంగాల్- 9, ఒడిశా- 6, హిమాచల్ ప్రదేశ్- 4, జార్ఖండ్- 3, చండీగఢ్- 1, లోక్‌ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఈ సమయంలో మహాత్మ గాంధీపై మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా మన జాతిపిత మహాత్మ గాంధీపై సినిమా తీసేవరకు ఆయన గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు అని అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. దీంతో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. దీంతో... మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ మండిపడింది. మహాత్ముడి వారసత్వాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించింది.

ఇదే సమయంలో... గాంధీ అంటే బయటి ప్రపంచంలో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించిన మోడీ... స్వాతంత్ర్యం సిద్ధించిన ఈ 75 సంవత్సరాల్లో మహాత్ముడి గురించి ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత తమపై లేదా? అని ప్రశ్నించారు. మహాత్ముడిపై హాలీవుడ్‌ లో తీసిన సినిమా విడుదలైన తరువాతే ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రపంచ దేశాల్లో ఏర్పడిందని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల రియాక్షన్ సంగతి కాసేపు పక్కనపెడితే... కాంగ్రెస్ పార్టీ మాత్రం కస్సుమంది. ఇందులో భాగంగా... అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. మహాత్ముడిని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే సిద్ధాంతాలను అనుసరించే వాళ్లు ఎప్పటికీ బాపూజీ చూపిన సత్య మార్గంలో ప్రయాణించలేరని అన్నారు.

ఇదే సమయంలో మోడీ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ... మహాత్మాగాంధీ గురించి తెలుసుకోవాలంటే పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ మాత్రమే సినిమా చూడాలని సెటైర్స్ వేశారు. ఆరెస్సెస్స్ విద్యార్థి నుంచి గాంధీజీకి ఎలాంటి సర్టిఫికేట్ అక్కర్లేదని.. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, నెల్సన్ మండేలాకు గాంధీ తక్కువేం కాదని తెలిపారు.

ఇదే క్రమంలో... మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఘాటుగా స్పందించారు. ఇందులో భాగంగా... ఢిల్లీ, వారణాసి, అహ్మదాబాద్‌ లలో గాంధీ పేరుతో ఉన్న సంస్థలను కేంద్ర ప్రభుత్వమే ధ్వంసం చేసిందని విమర్శించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.