ఏం 'టంగయ్యా' స్వామీ.. మోడీపై విసుర్లు!
ఒక మాట మాట్లాడితే.. దానికి కట్టుబడి ఉండాలి. లేదా.. అసలు ఆ మాటే మాట్లాడకూడదు.
By: Tupaki Desk | 15 May 2024 11:30 AM GMTఒక మాట మాట్లాడితే.. దానికి కట్టుబడి ఉండాలి. లేదా.. అసలు ఆ మాటే మాట్లాడకూడదు. పైగా ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగాఉన్న నేపథ్యంలో ప్రజలకు-నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను వేరే ఎవరో వచ్చి వివరించాల్సిన అవసరం లేదు. ప్రజలే విశ్లేషకులుగా మారుతున్నారు. దీంతో నాయకులు చెబుతున్న మాటలను వారు నిశితంగానే గమనిస్తున్నారు. నాయకులు ఎంతటి ఉద్దండులైనా.. కూడా వారు చెబుతున్న ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న దేశ సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ.. ముస్లింలను ఉద్దేశించి అనే క వ్యాఖ్యలు చేశారు. వారి రిజర్వేషన్లు ఎత్తేస్తామన్నారు. అంతేకాదు.. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏంటి? అనే ప్రశ్న ను కూడా తీసుకువచ్చారు. వారి రిజర్వేషన్లు ఎత్తేసి.. వాటిని ఓబీసీలకు పంచేస్తామని కూడా చెప్పారు. ఇక, కాంగ్రెస్ వస్తే.. పెద్ద ఎత్తున హిందూ వర్గాల ఆస్తులు లాగేసుకుని.. ముస్లింలకు పంచేస్తుందని కూడా పెద్ద వివాదం లేవనెత్తారు. దీనికి కౌంటర్ ఇచ్చు కోలేక కాంగ్రెస్ నోరెళ్ల బెట్టింది.
ఇంత బలంగా ముస్లింలపై విమర్శలు చేసిన మోడీ.. అనూహ్యంగా టంగ్ మార్చేశారు. నాలుగోదశ పోలింగ్ ముగిసిన తర్వాత.. ఎన్డీయే కూటమి పేలమైన ఓటు బ్యాంకును సొంతం చేసుకుందన్న విశ్లేషణలు వచ్చిన దరిమిలా.. మోడీ ముస్లింలపై ప్రేమ కురిపించారు. వారిపై ఎన్ని పొగడ్తలో కురిపించారు. ముస్లింలు చాలా పేదవారని అన్నారు. అంతేకాదు.. గతంలో తనకు ఒకరోజు ముస్లిం స్నేహితులే అన్నం పెట్టి ఆకలి తీర్చారని కూడా.. సెంటిమెంటు డైలాగులు పండించారు.
మోడీ ఏమన్నారంటే..
+ ముస్లింలపై తన వ్యాఖ్యలను కొందరు కావాలని వక్రీకరించారని తెలిపారు.
కౌంటర్: తొలి మూడు దశల ఎన్నికల సమయంలో 6 మీడియాచానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఈ మాట ఎందుకు చెప్పలేదు?
+ చిన్నప్పుడు తమ ఇంట్లో రంజాన్, ఈద్ పండగను కూడా నిర్వహించినట్టు చెప్పారు.
కౌంటర్: అధికారంలోకి వచ్చాక.. ఒక్కరోజైనా.. ఈ విషయం చెప్పారా? ముస్లింలతో కలిసి ఇప్తార్ విందు తీసుకున్నారా?
+ ఎక్కువమంది పిల్లలు గురించి మాట్లాడినప్పుడు అది ముస్లింల గురించి అని ఎవరు చెప్పారు? అని గడుసు ప్రశ్నవేశారు.
కౌంటర్: ఇది పూర్తిగా అబద్ధం. రాజస్థాన్ నుంచి మహారాష్ట్ర, యూపీలో మోడీ.. చేసిన ప్రచారం ముస్లింల పిల్లల గురించేనని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పుడు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడారు.
+ 2002లో గోద్రా రైలు దుర్ఘటన జరిగినప్పుడు కూడా తన ప్రత్యర్థులు ముస్లిం వర్గంలో తన ప్రతిష్ఠను దెబ్బతీశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కౌంటర్: మరి బీబీసీ డాక్యుమెంటరీని ఎందుకు అడ్డుకున్నారు. ఈ విషయాలు అప్పుడు ఎందుకు చెప్పలేదు.
+ నా స్నేహితుల్లో చాలా మంది ముస్లింలు ఉన్నారని మోడీ చెప్పారు.
కౌంటర్: ఒక్కరినైనా ఏనాడైనా.. సమాజానికి చూపించారా? ఒక్కస్నేహితుడినైనా రాజకీయంగా తీసుకువచ్చారా? టికెట్ ఇచ్చారా?
+ హిందూ-ముస్లిం అంటూ తేడా చూపడం ప్రారంభించిన రోజు.. ప్రజాజీవితంలో ఉండే అర్హత తనకు లేదని కూడా చెప్పుకొచ్చారు.
కౌంటర్: అసలు ప్రచారం అంతా కూడా.. ఈ `తేడా` చుట్టే తిరిగింది. కానీ, ఇప్పుడు టంగు మార్చేశారు.
కొసమెరుపు: నాలుగు దశల్లో జరిగిన పోలింగ్‌లో ఆయన ఇలా మాట్లాడలేదు. మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్న యూపీలోని నియోజకవర్గాల్లో ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. దీంతో మోడీ టంగ్ మారిందనే చర్చ సాగుతోంది.