ఆర్- అంటే రేవంత్ కాదు.. ఆయన తొందర పడుతున్నారు: మోడీ
తాను గత రెండు సార్లు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు.. 'డబుల్ ఆర్' ట్యాక్స్ గురించి ప్రస్తావించాన న్నారు. ఆ వెంటనే ఇక్కడి ముఖ్యమంత్రి(రేవంత్‌రెడ్డి-పేరు చెప్పలేదు) తనను అన్నట్టుగా బాధపడుతున్నారు.
By: Tupaki Desk | 10 May 2024 5:02 PM GMTతెలంగాణలో పర్యటించి.. ఎల్‌బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన భాగ్యనగర్ జనసభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను గత రెండు సార్లు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు.. 'డబుల్ ఆర్' ట్యాక్స్ గురించి ప్రస్తావించాన న్నారు. ఆ వెంటనే ఇక్కడి ముఖ్యమంత్రి(రేవంత్‌రెడ్డి-పేరు చెప్పలేదు) తనను అన్నట్టుగా బాధపడుతున్నారు. తడుముకున్నా రు. కానీ, డబుల్ ఆర్‌లో ఒక ఆర్- అంటే రజాకార్. అని ప్రధాని వివరించారు. రెండో ఆర్-ఢిల్లీలో ఉంటుందన్నారు. ఇక్కడ కూడా పేరు చెప్పకుండా రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు.
''మీకు రజాకార్ ట్యాక్స్ గురించి చెప్పాలంటే.. పాతబస్తీ వెళ్లండి. అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది'' అని మోడీ పరోక్షంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సాధించుకున్నా రజాకార్ల నుంచి ప్రజలకు విముక్తి లభించలే దన్నారు. ఆర్ ట్యాక్స్‌తో ఇక్కడి ప్రజలు విసిగిపోతున్నారని.. మార్పు కోరుకుంటున్నారనితెలిపారు. తాను ఇప్పటికి పర్యటించి న మేరకు.. ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ''కాంగ్రెస్ వద్దు, బీఆర్ ఎస్ వద్దు.. బీజేపీనే కావాలని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. జూన్ 4న ఇది నిజం అవుతుంది'' అని ప్రధాని మోడీ వివరించారు.
గతంలో హైదరాబాద్ అంటే బాంబు పేలుళ్లు గుర్తుకువ చ్చేవని ప్రధాని మోడీ చెప్పారు. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లే దీనికి ఉదాహరణగా తెలిపారు. అయితే..కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత.. ఎక్కడైనా ఒక్క ఘటన జరిగిందా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రశాంతతకు తాము ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ ప్రజలు చాలా విజ్ఞులని.. ఇక్కడి వారు తెలివిగల వారని కొనియాడారు. బీజేపీని కోరుకుంటున్నారని తెలిపారు.
''కానీ, మీరు ఒక్క విషయం గుర్తించాలి. ఇక్కడున్న పార్టీలు ప్రశాంతతను కోరుకోవడం లేదు. ప్రజల బాధపడితే.. దాని నుంచి రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నాయి. అందుకే మోడీని తప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. విజ్ఞులైన మీరు ఆలోచించి.. బీజేపీ వారిని ఎన్నుకోవాలి'' అని మోడీ పిలుపునిచ్చారు. ఇక, తన ప్రసంగంలో యువరాజు అంటూ రాహుల్ పై సెటైర్లు వేశారు. అదేవిధంగా కాంగ్రెస్ వస్తే.. మళ్లీ పాత కాలపు పాలనను ఏరికోరి తెచ్చుకున్నట్టే అవుతుందని చెప్పారు. అదేవిధంగా ప్రజల ఆస్తులను దోచుకుంటారని మోడీ వ్యాఖ్యానించారు.