Begin typing your search above and press return to search.

మోడీనా మ‌జాకా: విక‌సిత భార‌త్‌.. 'ఎన్నిక‌ల' సంక‌ల్ప యాత్ర‌!

వ‌చ్చే 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రానికి కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు స‌మాయ‌త్తం అయిపోయింది.

By:  Tupaki Desk   |   30 Nov 2023 4:46 AM GMT
మోడీనా మ‌జాకా: విక‌సిత భార‌త్‌.. ఎన్నిక‌ల సంక‌ల్ప యాత్ర‌!
X

వ‌చ్చే 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌రానికి కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు స‌మాయ‌త్తం అయిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా అడుగులు వ‌డివ‌డిగా వేస్తోంది. దీనిలో భాగంగా.. క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న గిరిజ‌నులు, ఎస్సీ, ఎస్టీల‌(ఆదివాసీ) ఓటు బ్యాంకును త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాల‌కు ప్ర‌ధాని మోడీ కీల‌క కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు.. ఈ కార్య‌క్ర‌మాన్ని నిరంత‌రం ప‌ర్యవేక్షించేందుకు.. ఎక్క‌డిక‌క్క‌డ సూచ‌న‌లు స‌ల‌హాలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు.

దేశ‌వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలు మిన‌హా(ఎన్నిక‌ల నేప‌థ్యంలో) మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రారంభించిన మోడీ ఎన్నిక‌ల కార్య‌క్ర‌మ‌మే.. ``విక‌సిత భార‌త్ సంక‌ల్ప యాత్ర‌``. కానీ, ఈ యాత్ర‌ను ప్ర‌తిప‌క్షాలు విక‌సిత భార‌త్ `ఎన్నిక‌ల` సంక‌ల్ప యాత్ర‌గా పేర్కొంటున్నాయి. దీనికి కార‌ణం.. 2014 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు.. ల‌బ్ధి పొందుతున్న‌వారి వివ‌రాలు.. ఆయా ప‌థ‌కాల ద్వారా ఎంత మేర‌కు ల‌బ్ధి పొందారనే వివ‌రాల‌ను.. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. దీనికి పెద్ద ఎత్తున యంత్రాంగాన్ని కూడా క‌దిలిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఏపీలో విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప యాత్ర‌ను జోరుగా నిర్వ‌హిస్తున్నారు మొత్తంగా 60 రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించే ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్నారు. దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌ని(కోడ్ లేని) రాష్ట్రాల్లో ప్ర‌తి జిల్లాలోనూ ఎస్సీ, ఎస్టీలు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో ఈ యాత్ర‌లు జోరుగా సాగుతున్నాయి. అక్క‌డి జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం నేరుగా ఆదేశాలు జారీ చేసి, ల‌క్ష్యాలు నిర్దేశించి మ‌రీ ఈ యాత్ర‌ను నిర్వ‌హిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ యాత్ర‌ల్లో .. ఇప్ప‌టికే ల‌బ్ధి పొందిన వారి వివ‌రాలు పేర్కొంటారు. ఎంతెంత ల‌బ్ధి పొందారో .. వారితోనే చెప్పిస్తారు. ఇక‌, కొత్త‌గా ఎవ‌రైనా కేంద్ర ప‌థ‌కాల ద్వారా ల‌బ్ధి పొంద‌ని వారు ఉంటే.. వారిని వెతికి మ‌రీ ఈ జాబితాలో చేరుస్తారు.

మొత్తంగా చూస్తే.. ఆయాల‌బ్ధి దారుల చేత‌.. మోడీకి జై కొట్టిస్తున్నారు. ఒక‌ర‌కంగా చూస్తే.. ఇది ప్ర‌జా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్ర‌ధాని చేస్తున్న కార్య‌క్ర‌మంగానే ఉంది. కానీ, కొంత లోతుగా ఆలోచిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ల‌బ్ధిదారుల ద్వారా.. మోడీ ఫొటోను చూపించి.. ఓట్లు వేయించుకునే వ్యూహం ఉంద‌నిఇటు ప్ర‌తిప‌క్షాలు.. అటు ప్ర‌జాసంఘాల నాయ‌కులు కూడా చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌లు అత్యంత క్లిష్టంగా ఉండ‌డం.. పైగా.. కాంగ్రెస్ ప‌లు రాష్ట్రాల్లో పుంజుకోవ‌డం, ఇండియా కూట‌మి ఎఫెక్ట్ వంటి అనేక అంశాల నేప‌థ్యంలో క్షేత్ర‌స్థాయిలో ప్ర‌ధాని మోడీ విక‌సిత భార‌త్ ఎన్నిక‌ల యాత్ర‌లు చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లుఊపందుకున్నాయి.