Begin typing your search above and press return to search.

మోడీ ఎన్నిక‌ల 'పంచ‌' వ్యూహం.. కాంగ్రెస్ చిత్తేనా?

తాజాగా తీసుకున్న పంచ వ్యూహం.. కాంగ్రెస్‌కు మ‌ర‌ణ శాస‌నంగా మార‌నుంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   8 March 2024 9:17 AM GMT
మోడీ ఎన్నిక‌ల పంచ‌ వ్యూహం.. కాంగ్రెస్ చిత్తేనా?
X

''వ‌చ్చేస్తాం.. మ‌ళ్లీ మేమే వ‌చ్చేస్తాం. మాదే అధికారం. ఈసారి 370 సీట్లు మాకే గుండుగుత్త‌గా రానున్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు''-ఇదీ.. త‌ర‌చుగా ప్ర‌ధాని మోడీ ఎక్క‌డ ఏవేదిక ఎక్కినా చెబుతున్న మాట‌. కానీ, ఆయ‌న చెబుతున్న దానిని ఎంత మంది విశ్వ‌సించారో లేదో తెలియ‌దు కానీ..ఎన్నిక‌ల‌కు స‌మ‌యం చేరువ అవుతున్న కొద్దీ.. మోడీ త‌న ఎన్నిక‌ల విశ్వ‌రూపాన్ని.. వ్యూహాల ను ఒక్కొక్క‌టిగా.. గుత్తులుగుత్తులుగా కూడా బ‌య‌ట‌కు తీసుకువ‌స్తున్నారు.

పైగా ఎన్నిక‌ల షెడ్యూల్‌కు ఎలాంటిఇబ్బంది రాకుండా.. ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. వారికే ప్ర‌తికూల మ‌య్యేలా మోడీ త‌న చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. తాజాగా తీసుకున్న పంచ వ్యూహం.. కాంగ్రెస్‌కు మ‌ర‌ణ శాస‌నంగా మార‌నుంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. మోడీ తీసుకున్న నిర్ణ‌యాల‌పై విమ‌ర్శ‌లు ఉండొచ్చు.. కానీ, ఎన్నిక‌ల వేళ బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఆయ‌న వైపే మొగ్గు చూప‌డం ఖాయ‌మ‌నే చర్చ కూడా జ‌రుగుతోంది.

ఇవీ.. పంచ వ్యూహాలు

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు: కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఏకంగా 4 శాతం డీఏ పెంచారు. ఇది త‌క్ష‌ణ‌మే కాదు.. గ‌త జ‌న‌వ‌రి నుంచి అమ‌లు చేయ‌నున్నారు. ఈ నిధుల‌ను 24 గంట‌ల్లో వారి వారి ఖాతాల్లో జ‌మ చేయ‌నున్నారు. ఫ‌లితంగా 30 కోట్ల ఓట్ల‌కు మోడీ గేలం వేశారు.

మ‌హిళా మ‌ణులు: 40 కోట్ల కుటుంబాలు వినియోగిస్తున్న వంట గ్యాస్‌ను రూ.100 త‌క్ష‌ణం త‌గ్గించారు. త‌ద్వారా.. సుమారు 60 కోట్ల ఓట్ల బీజేపీకి అనుకూలంగా మారే అవ‌కాశం ఉందనే అంచ‌నా ఉంది.

రైతులు: జ‌న‌ప‌నార‌పై మ‌ద్ద‌తు ధ‌ర‌ల‌ను 285 రూపాయ‌ల‌ను రాత్రికి రాత్రి పెంచారు. త‌ద్వారా.. 2 ల‌క్ష‌ల మంది రైతుల‌కు మేలు జ‌ర‌గ‌నుంది. దీంతో 3 ల‌క్ష‌ల‌కు పైగా ఓటు బ్యాంకు, రైతుల నుంచిసానుభూతిని మోడీ సొంతం చేసుకోనున్నారు.

యువ‌త‌: సాఫ్ట్ వేర్ రంగానికి పెద్ద పీట వేస్తూ.. ఏఐ ఆధారిత శిక్ష‌ణ‌కు మోడీ శ్రీకారం చుట్టారు. దేశ‌వ్యాప్తంగా యువ‌త ఓట్ల‌ను ఆక‌ర్షించే వ్యూహంలో భాగంగా వారికి ఏఐపై శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు.

పేద‌లు: ఉజ్వ‌ల వంట గ్యాస్ తీసుకున్న పేద కుటుంబాల‌కు చెందిన‌ మ‌హిళ‌ల‌ను కేంద్రంగా చేసుకుని మోడీ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఇది కాంగ్రెస్ ఓటు బ్యాంకును ప‌టాపంచ‌లు చేసి.. మోడీవైపు తిప్పుకొనే ప్ర‌ధాన ఎత్తుగ‌డ‌.

కొస‌మెరుపు..

వాస్త‌వానికి మోడీ అధికారంలోకి రాక‌ముందు.. అంటే 2014లో 435 రూపాయ‌లుగా ఉన్న వంట గ్యాస్ ధ‌ర‌.. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 995-1102 మ‌ధ్య కొన‌సాగుతోంది. అంటే.. సుమారు 550 రూపాయ‌లు పెంచింది.. మోడీనే. కానీ, ఎన్నిక‌ల వేళ 100 త‌గ్గించ‌డం ద్వారా.. ఓటు బ్యాంకు య‌త్నాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలుస్తోంది.

ఈ రోజు లేదా రేప‌ట్లో పెట్రోల్ ధ‌ర‌ల‌ను కూడా త‌గ్గించే అవ‌కాశం ఉందని తెలుస్తోంది. లీట‌రుకు రూ.5-10 మ‌ధ్య ఈ ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉంది. ఏదేమైనా మూడో సారి ముచ్చ‌ట‌.. మోడీని ఈ దిశ‌గా న‌డిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఎన్నిక‌ల‌య్యాక ప‌రిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.