ఎలక్షన్ కోసమేనా ? వర్గీకరణ కమిటి
ఎస్సీ వర్గీకరణ హామీపై నరేంద్రమోడీ చాలా స్పీడుగా యాక్ట్ చేస్తున్నారు. వర్గీకరణకు వీలుగా కమిటిని ఏర్పాటుచేయాలని కేంద్ర క్యాబినెట్ సెక్రటరీని మోడీ ఆదేశించారు.
By: Tupaki Desk | 25 Nov 2023 5:20 AM GMTఎస్సీ వర్గీకరణ హామీపై నరేంద్రమోడీ చాలా స్పీడుగా యాక్ట్ చేస్తున్నారు. వర్గీకరణకు వీలుగా కమిటిని ఏర్పాటుచేయాలని కేంద్ర క్యాబినెట్ సెక్రటరీని మోడీ ఆదేశించారు. ప్రాసెస్ ను స్పీడు చేయాలని ఆదేశించారు. ఈనెల 11వ తేదీన హైదరాబాద్ లో జరిగిన ఎంఆర్పీఎస్ విశ్వరూప సభలో ఎస్సీ వర్గీకరణకు మోడీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీకి అనుకూలంగా చర్యలు తీసుకోవాలని శుక్రవారం మోడీ క్యాబినెట్ కార్యదర్శిని ఆదేశించారు. అంటే హామీ హామీ ఇచ్చిన రెండువారాల్లోనే కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లయ్యింది.
నిజానికి మోడీ ఇచ్చిన హామీల్లో ఏదీ ఇంత స్పీడుగా ఆచరణలోకి వచ్చినట్లు కనబడటంలేదు. ఇపుడు కూడా ఎస్సీ వర్గీకరణ హామీ ఎందుకింత స్పీడుగా యాక్షన్ మొదలైంది ? ఎందుకంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అని అర్ధమవుతోంది. నవంబర్ 30వ తేదీన జరగబోయే పోలింగులో ఎస్సీల ఓట్లు ముఖ్యంగా మాదిగల ఓట్ల కోసమే మోడీ ఇంత స్పీడుగా యాక్ట్ చేస్తున్నారు. బహిరంగసభలో ఎంఆర్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు కృష్ణమాదిగ కూడా పాల్గొన్నారు.
సభలో మోడీని చూడగానే కృష్ణ ఉద్వేగంతో కన్నీళ్ళు పెట్టుకోవటం, కృష్ణను మోడీ దగ్గరకు తీసుకుని హత్తుకోవటం, భుజంతట్టి ఓదార్చటం అంత నాటకీయంగా జరిగిపోయింది. బహిరంగసభలో పాల్గొన్నవాళ్ళకు, చూసిన వాళ్ళకు కూడా ఈ దృశ్యాలు ఆశ్చర్యమనిపించాయి. తర్వాత బీజేపీకి మద్దతుగా కృష్ణమాదిగ ప్రచారం మొదలుపెట్టారు. అయితే మోడీ చేసిన ప్రకటనను మాలలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని మాదిగలు ఎంతగా పట్టుబడుతున్నారో చేయకూడదని మాలలు అంతే తీవ్రస్ధాయిలో వ్యతిరేకిస్తున్నారు.
వర్గీకరణ విషయంలో భిన్న డిమాండ్లతో మాదిగలు ఒకవైపు మాలలు ఒకవైపు మోహరిస్తున్నారు. అందుకనే ఏ పార్టీ కూడా ఈ అంశంపై ఎక్కడా హామీలిచ్చింది లేదు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కదలించటమంటే తేనెతుట్టెను కదపటమే అని అందరికీ తెలుసు. అయితే ఇపుడు మోడీ వర్గీకరణకు ఎందుకు హామీ ఇచ్చారు ? ఎందుకంటే ఎలాగూ బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు. కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే నాలుగు ఓట్లన్నా వస్తుందని అనుకున్నట్లున్నారు. ఎలాగూ తెలంగాణాలో మాదిగల జనాభా ఎక్కువగానే ఉంది. అందుకనే వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.