Begin typing your search above and press return to search.

మోడీ ఉపవాస దీక్ష... దేశప్రజలకు ఆడియో సందేశం!

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సమీపిస్తున్న వేళ ఆ మహత్కార్యాన్ని వీక్షించేందుకు దేశమంతా ఎదురుచూస్తోంది.

By:  Tupaki Desk   |   12 Jan 2024 6:54 AM GMT
మోడీ ఉపవాస దీక్ష... దేశప్రజలకు  ఆడియో  సందేశం!
X

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సమీపిస్తున్న వేళ ఆ మహత్కార్యాన్ని వీక్షించేందుకు దేశమంతా ఎదురుచూస్తోంది. ఈ దివ్యకార్యక్రమానికి ఇంకా 11 రోజులే మిగిలి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఇందులో భాగంగా రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలతో పంచుకున్నారు.

అవును... అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ఇంకా 11 రోజులే మిగిలి ఉన్నందున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక సందేశం ఇచ్చారు. ఇందులో భాగంగా... శుక్రవారం నుంచి తాను ప్రత్యేక అనుష్ఠానాన్ని అనుసరిస్తానని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని ఆడియో సందేశం విడుదల చేశారు.

ఈ ఆడియో సందేశాన్ని తొలుత యూట్యూబ్ లో పోస్ట్ చేసి, అనంతరం ఆ లింక్ ని ఎక్స్ లో షేర్ చేశారు. ఇందులో భాగంగా... ఈ మహోన్నత కార్యక్రమాన్ని కనులారా వీక్షించే అవకాశం కలగడం తన అదృష్టమని తెలిపిన మోడీ... గతంలో తాను ఎప్పుడూ ఇంతటి ఉద్వేగానికి లోను కాలేదని అన్నారు. జీవితంలో తొలిసారి అలాంటి అనుభూతులను అనుభవిస్తున్నానని పేర్కొన్నారు.

ఇదే సమయంలో... శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సమయంలో భారతీయులకు ప్రాతినిధ్యం వహించే సాధనంగా తనను దేవుడు ఎంచుకున్నాడని అన్నారు. ఈ అద్భుత సమయంలో తన మదిలో చెలరేగిన భావాలను వ్యక్తీకరించడం సాధ్యంకాదని వెల్లడించారు. ఈ సమయంలో... ఆలయాల్లో ప్రాణప్రతిష్ఠాపనకు ముందు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందని, అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముందు ఉపవాసం ఉండాలని పురాణాల్లో పేర్కొన్నారని తెలిపారు.

ఇందులో భాగంగా... బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం, అనంతరం ప్రార్థనలు చేయడంతోపాటు ఆహార నియమాలు పాటించడం వంటివి చేయాలని అన్నారు.

కాగా... జనవరి 22న మధ్యాహ్నం 12:20 గంటలకు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన ప్రధాని మోడీ చేతుల మీదుగానే జరగనున్న సంగతి తెలిసిందే. దీనికోసం జనవరి 16 నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇదే సమయంలో... అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లోనూ వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.