Begin typing your search above and press return to search.

అవినీతిలో మంత్రులు పోటీ ప‌డుతున్నారు: జ‌గ‌న్ స‌ర్కారుపై మోడీ ఫైర్‌

ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారుపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు గుప్పించారు.

By:  Tupaki Desk   |   18 March 2024 3:48 AM GMT
అవినీతిలో మంత్రులు పోటీ ప‌డుతున్నారు:  జ‌గ‌న్ స‌ర్కారుపై మోడీ ఫైర్‌
X

ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారుపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు గుప్పించారు. ``జ‌గ‌న్ స‌ర్కార్ అవినీతిలో పోటీ ప‌డుతోంది. మంత్రులు ఒక‌రిని మించి మ‌రొక‌రు దోచుకునేందుకు పోటీ ప‌డుతున్నారు`` అని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తేడాలేద‌న్నారు. అక్క‌డి వారే ఇక్క‌డా ఉన్నార‌ని.. ఇక్క‌డి వారే అక్క‌డ న‌డిపిస్తున్నార‌ని ప‌రోక్షంగా వైఎస్ ష‌ర్మిల‌, వైఎస్ జ‌గ‌న్‌ల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు అటు ప‌డ‌కుండా ప్ర‌జ‌లే చూసుకోవాల‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు.

ఇక‌, ఎన్డీయే ప్ర‌భుత్వం రాష్ట్రానికి ఎన్నో ఇచ్చింద‌ని చెప్పారు. ప్ర‌తి విష‌యంలోనూ పార‌ద‌ర్శ‌కంగా ఉండ‌బ‌ట్టే ప‌దేళ్ల త‌ర్వాత కూడా ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి ఓట్లు అడుగుతున్నామ‌న్నారు. ఏపీలో ఇలా ఓట్లు అడిగేందుకు ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతోంద‌ని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్ర‌భుత్వం అవినీతిలో మునిగిపోయింది.. ఓట్లు అడిగే ప‌రిస్థితి కూడా లేద‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ప్ర‌ధాని త‌న ప్ర‌సంగంలో మొత్తంగా.. త‌న పాల‌న‌, దేశంలో తాను చేసిన అభివృద్ధి.. గ‌త ప‌దేళ్ల కాలంలో ఏపీకి తాము ఇచ్చిన ప్రాజెక్టులు.. చేసిన ప‌నుల‌ను పెద్ద‌గా హైలెట్ చేసుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు.

ఇదేస‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ.. ఏపీకి కేంద్రం ఏమీ ఇవ్వ‌లేద‌న్న విమ‌ర్శ‌ల‌కు కూడా చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. గ‌త పదేళ్ల కాలంలో తాము చేసిన ప‌నుల‌ను వివ‌రించారు. ఐఐటీ, ఐఐఎం, వంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ల‌ను ఇక్క‌డ నెల‌కొల్ప‌డం ద్వారా ఏపీ అభివృద్ధికి కేంద్రంలోని త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉన్న‌ద‌న్న విష‌యాన్ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు. త‌ద్వారా బీజేపీపై వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించే ప్ర‌య‌త్నాన్ని ప‌రోక్షంగా చేశారు. మొత్తం ప్ర‌సంగంలో సీఎం జ‌గ‌న్ పేరును ఒకే ఒక్క‌సారి ప‌లికిన మోడీ.. త‌న ప్ర‌సంగంలో చంద్ర‌బాబు పేరును కూడా ఒకే ఒక్క‌సారి ప‌లికారు. ప‌వ‌న్ పేరును మాత్రం రెండు సార్లు ప‌లికారు. ఎలా చూసుకున్నా.. మోడీ ల‌క్ష్యం.. బీజేపీ వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించే దిశ‌గానే ఆయ‌న ప్ర‌సంగం ముందుకు సాగింద‌నేది వాస్త‌వం.