Begin typing your search above and press return to search.

మూడోసారి ప్రధానిగా మోదీ తొలి సంతకం దీనిపైనే!

మూడోసారి ప్రధానిగా మోదీ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు.

By:  Tupaki Desk   |   10 Jun 2024 8:08 AM GMT
మూడోసారి ప్రధానిగా మోదీ తొలి సంతకం దీనిపైనే!
X

నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరుసగా మూడుసార్లు ప్రధానిగా ఎంపికై జవహర్‌ లాల్‌ నెహ్రూ రికార్డును సమం చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ కూడా వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రి అయిన సంగతి తెలిసిందే.

మూడోసారి ప్రధానిగా మోదీ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. ప్రధాని కాకుండా మొత్తం 71 మందికి కేంద్ర కేబినెట్‌ లో అవకాశం దక్కింది. వీరిలో 30 మందికి కేబినెట్‌ మంత్రి హోదా, ఐదుగురికి స్వతంత్ర మంత్రి హోదా, 36 మందికి సహాయ మంత్రి పదవులు లభించాయి. మిత్ర పక్షాలకు కూడా భారీగానే ప్రాతినిధ్యం దక్కింది.

కాగా మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే తన విధుల్లో దిగిపోయారు. తన తొలి ప్రాధాన్యాన్ని రైతులకే ఇచ్చారు. ప్రధానమంత్రి కిసాన్‌ నిధి విడుదలకు సంబంధించిన ఫైలుపై ఆయన తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్లమంది రైతులకు రూ.20 వేల కోట్ల ఆర్థిక సహాయం అందనుంది. తద్వారా రైతులకే తమ ప్రాధాన్యమని ఆయన నొక్కిచెప్పినట్టు అయ్యింది.

తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికే కట్టుబడి ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు. బాధ్యతలు స్వీకరించాక వారి సంక్షేమానికి సంబంధించిన అంశంపైన సంతకం పెట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ వ్యవసాయ రంగంపైన, రైతుల పైన తమ ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెడుతుందని వెల్లడించారు. ఈ మేరకు మూడోసారి ప్రధానిగా తన తొలి సంతకం చేశాక మోదీ మీడియాతో మాట్లాడారు.

కాగా ప్రధాని మోదీ తొలి కేబినెట్‌ సమావేశం జూన్‌ 10 సాయంత్రం జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధామ్యాలపై చర్చిస్తారని తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలు అంశాలపైన చర్చ ఉంటుందని అంటున్నారు. అందులోనూ ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 2014, 2019ల్లో బీజేపీకి కేంద్రంలో సొంతంగా మెజార్టీ వచ్చింది. దీంతో మిత్ర పక్షాలపైన ఆధారపడాల్సిన అవసరం రాలేదు. అయితే ఈసారి మెజార్టీకి 32 సీట్ల దూరంలో ఆగిపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే పక్షాలపైన ఆధారపడక తప్పలేదు.

ఈ నేపథ్యంలో బీజేపీ ఇచ్చిన హామీలతోపాటు ఎన్డీయే భాగస్వామపక్షాల అభిప్రాయాలు, ఆలోచనలను కూడా ప్రధాని మోదీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్నాళ్లూ ఏకపక్షంగా ముందుకెళ్లిన మోదీ ఇప్పుడు మిత్రపక్షాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.

మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో జరగబోయే పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజున రెండు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఈ మేరకు పార్లమెంటు సమావేశానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.