పాక్ గగనతలంపై మోడీ విమానం... 46 నిమిషాలు ఏం జరిగింది?
భారత ప్రధాని నంద్రమోడీ తన పోలాండ్ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చే క్రమంలో పాకిస్థాన్ మీదుగా చేరుకున్నారు.
By: Tupaki Desk | 27 Aug 2024 5:37 AM GMTభారత ప్రధాని నంద్రమోడీ తన పోలాండ్ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చే క్రమంలో పాకిస్థాన్ మీదుగా చేరుకున్నారు. వాస్తవానికి ఇది పెద్ద ప్రత్యేకమైన విషయం కానప్పటికీ... గతంలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఈ వ్యవహారం రెండు దేశాల్లోనూ తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఈ మేరకు పాక్ మీడియాలోనూ ఆసక్తికర కథనాలు వచ్చాయి.
అవును... పోలాండ్ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణం అయిన ప్రధాని మోడీ విమానం పాకిస్థాన్ లోని చిత్రాల్ పై నుంచి గగనతల ఆంక్షలు ఉన్న ఇస్లామాబాద్, లాహోర్ పై నుంచి ప్రయాణించి ఢిల్లీకి చేరుకుంది. ఈ సమయంలో ఆంక్షలు ఉన్న పాక్ గగనతలంలో సుమారు 46 నిమిషాలు పర్యటించినట్లు చెబుతున్నారు.
ఇందులో భాగంగా... ఉదయం 10:15 గంటలకు ప్రధాని మోడీ విమానం పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించి 11.01 గంటలకు దేశాన్ని వీడినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమయలో... ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న విమానానికి ఎలాంటి అడ్డంకులూ లేకుండా కాల్ సంకేతం ఇచ్చినట్లు తెలుస్తోంది. పాక్ అధ్యక్షుడు, ప్రధాని ప్రయాణించే సమయంలోనూ ఇలాంటి సంకేతాలే ఇస్తారు.
కాగా... 2019 ఫిబ్రవరి 26 తర్వాత తమ గగనతలంపై నుంచి భారతీయ విమానాల రాకపోకలపై పాకిస్థాన్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్పట్లో మోడీ జర్మనీ పర్యటన సదర్భంగా ఈ గగనతలాన్ని వాడుకోవడానికి భారత్ నుంచి అభ్యర్థన వెళ్లినా ఒప్పుకోలేదని అంటారు. దీంతో అప్పటి నుంచి మోడీ.. పాక్ గగనతలంపై ప్రయాణించడం లేదు.
అయితే.. సుమారు ఐదేళ్ల విరామం తర్వాత తిరిగి తాజగా పాకిస్థాన్ గగనతలం మీదుగా భారత ప్రధానమంత్రి మోడీ ప్రయాణించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
కాగా... 1991లో ఉక్రెయిన్ కు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డ్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచ మీడియా సానుకూలంగా స్పందించింది. యుద్ధంలో తలపడుతున్న ఇరుదేశాల మధ్య మోడీ సమతూకంతో వ్యవహరించారని న్యూయార్క్ టైంస్ పేర్కొంది.