ఆప్ ఓట్లపై మోడీ గురి.. పంజాబ్‌లో కీలక నిర్ణయం
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలని నిర్ణయించుకున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. ఆదిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
By: Tupaki Desk | 30 Jan 2024 4:43 PM GMTవచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయం దక్కించుకుని తీరాలని నిర్ణయించుకున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. ఆదిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఒకవైపు పథకాలు పెంచుకుంటూ పోతూ.. మరోవైపు రాష్ట్రాలపైనా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో ప్రధాన శత్రువుగా ఉన్నా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వ్యవహారంపై కేంద్రం సీరియస్‌గానే ఉంది. ఎటు అవకాశం ఉంటే.. అటు ఆప్‌ను నొక్కుతోంది. ఇటీవల మద్యం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారం నుంచి ఆయన బయటకు రాలేదు. ఇంతలోనే ఆప్ నేతృత్వంలోని పంజాబ్ రాష్ట్రంపై మోడీ వల విసిరారు. ఇక్కడ మొత్తం 13 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి వీటిలో మెజారిటీ స్థానాలు ఆప్ పరిధిలోనే ఉన్నాయి. 2019లో కంటే.. వచ్చే ఎన్నికల్లో బలమైన స్తానాలు దక్కించుకునేందుకు మోడీ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇది బీజేపీకి ఉభయ కుశలోపరిగా ఉండనుంది. తమను తరచుగా విమర్శించే ఆప్ గళాన్ని కట్టడి చేయడంతోపాటు పార్లమెంటులో సొంతగా మెజారిటీ దక్కించుకునే పరిస్థితికి ఎదగాలని ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం పంజాబ్‌లో ఆప్ కు మెజారిటీ సిక్కుల అండదండలున్నాయి. ప్రస్తుతం సీఎంగా ఉన్న భగవంత్ మాన్ కూడా సిక్కులే. ఈక్రమంలో ఈ బలాన్ని ఏమాత్రం తగ్గించినా.. మోడీ పంట పండుతుంది. అందుకే.. మోడీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. తాజాగా రాజ్యసభసీటును రాష్ట్రపతి కోటాలో ఇదే రాష్ట్రానికి చెందిన సిక్కు కు కేటాయించారు. ఈయన సామాన్య మధ్య తరగతి నుంచి ఎదిగిన విద్యావేత్త, యువకుడు కూడా. ఆయనే సత్నాం సింగ్ సంధు.
తాజాగా రాష్ట్రపతి నామినేటెడ్ కొటాలో సంధుకు రాజ్యసభ సీటును కేటాయించింది. తద్వారా.. పంజాబ్‌లో బీజేపీ అనుకూల ఓటు బ్యాంకును సంపాయించుకునేందుకు, సిక్కులకు తాము వ్యతిరేకంగా కాదని చెప్పుకొనేందుకు ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నట్టు అయింది. దీని నుంచి ఓట్లను పిండాలనేది మోడీ గ్రూప్.. వ్యూహం. ఇక, సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన సత్నామ్ సింగ్ సంధు దేశంలోని ప్రముఖ విద్యావేత్తల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఈయనకు క్లాస్, మాస్ జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇదే ఇప్పుడు మోడీకి వరంగా మారనుంది.