Begin typing your search above and press return to search.

తెలంగాణా మీదనే ఫోకస్... ఏపీకి మోడీ వచ్చేదెపుడు ?

ఎందుకో ఈసారి ఏపీ కంటే తెలంగాణా మీదనే బీజేపీ పెద్దలు ఫుల్ ఫోకస్ పెట్టేశారు.

By:  Tupaki Desk   |   15 April 2024 4:16 AM GMT
తెలంగాణా మీదనే ఫోకస్... ఏపీకి మోడీ వచ్చేదెపుడు ?
X

ఎందుకో ఈసారి ఏపీ కంటే తెలంగాణా మీదనే బీజేపీ పెద్దలు ఫుల్ ఫోకస్ పెట్టేశారు. తెలంగాణా రాజకీయంగా కొంత ఆశాకిరణంగా కనిపిస్తోంది. అదే ఏపీ అయితే బాగా కష్టపడాలి. పైగా పొత్తులు ఉన్నాయి. ఏమున్నా పొత్తు పార్టీలు చూసుకుంటాయన్న ధీమా ఉంది కాబోలు.

అందుకే మూడు విడతల ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకున్న తరువాత నాలుగవ విడతలో జరిగే ఏపీ తెలంగాణా ఎన్నికల కోసం బీజేపీ దృష్టి పెట్టింది. అయితే ఏపీ కంటే తెలంగాణాకే ప్రయారిటీ ఇస్తోంది. తెలంగాణాలో మే 3 తరువాత నుంచి నరేంద్ర మోడీ వరస పర్యటనలు ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఆయన ఎన్నికల ప్రచారం సమాప్తం అయ్యే మే 11 లోగా రెండు విడతలుగా తెలంగాణాకు వస్తారు అని అంటున్నారు. ఈసారి తెలంగాణాలో కనీసంగా ఆరు నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ టార్గెట్ పెట్టుకుంది అని అంటున్నారు.

అదే ఏపీ విషయం చూస్తే బీజేపీ అగ్ర నేతలు ఈ వైపు చూస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. అయితే ఏపీలో కూటమిలో బీజేపీ ఉంది. తెలంగాణాలో సొంతంగా పోటీ చేస్తోంది. దాంతో తెలంగాణాకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటోంది అంటున్నారు.

ఏపీలో టీడీపీ తరఫున చంద్రబాబు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఈ ఇద్దరూ ప్రచారాలు చేస్తారు.దాంతో పాటు కొందరు కేంద్ర మంత్రులను కూడా పంపుతారు అని అంటున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రావచ్చు అన్నది కూడా వినిపిస్తోంది. ఇక ఫినిషింగ్ టచ్ గా అమిత్ షా ఒక రోజు టూర్, అలాగే మోడీ కుదిరితే ఒక రోజు టూర్ వేస్తారు అని అంటున్నారు.

అంటే ఏపీలో కంటే బీజేపీకి తెలంగాణా మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందని అంటున్నారు. గతంలో అంటే 2014 ఎన్నికల్లో చూస్తే బీజేపీ ప్రధాని అభ్యర్ధి హోదాలో నరేంద్ర మోడీ ఏపీలో పెద్ద ఎత్తున పర్యటించారు. ఆయన తిరుపతి నుంచి విశాఖ వరకూ టూర్ చేసి ఏపీలో కూటమిని ఆనాడు అనుకూలమైన గాలి వీచేలా చూశారు.

ఈసారి అయితే ఇప్పటికి కూటమి తరఫున ఉమ్మడిగా ఒక సభ నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారం ముగిసేలోగా మరో విడత వచ్చి మరో సభలో పాలు పంచుకోవచ్చు అని అంటున్నారు. మరి మోడీ ఒకటి రెండు సభలు ఏపీలో సరిపోతాయా టీడీపీ బీజేపీ జనసేన కూటమికి గెలుపు కిక్కు ఇవ్వగలుగుతారా అంటే వేచి చూడాల్సిందే.