Begin typing your search above and press return to search.

మోడీ ఇండియా ప్రైమ్ మినిస్టర్ కాదా...ఎందుకు విదేశాలకు ఎక్కువగా వెళ్తారు ?

ప్రధానిగా నరేంద్ర మోడీ చేసినన్ని విదేశీ పర్యటనలు మరే ప్రధాని చేసి ఉండదు. ప్రపంచంలోని అనేక దేశాలలో గత ప్రధానులు పర్యటించలేదు

By:  Tupaki Desk   |   20 Aug 2024 10:48 AM GMT
మోడీ ఇండియా ప్రైమ్ మినిస్టర్ కాదా...ఎందుకు విదేశాలకు ఎక్కువగా  వెళ్తారు ?
X

ప్రధానిగా నరేంద్ర మోడీ చేసినన్ని విదేశీ పర్యటనలు మరే ప్రధాని చేసి ఉండదు. ప్రపంచంలోని అనేక దేశాలలో గత ప్రధానులు పర్యటించలేదు. అలాగే దశాబ్దాల పాటు వెళ్లనివీ ఉన్నాయి. అలాంటి వాటిలో నరేంద్ర మోడీ పర్యటించడం ద్వారా కొత్త రికార్డునే క్రియేట్ చేశారు.

మోడీ విదేశీ పర్యటనలు చూస్తే పెద్ద జాబితాయే ఉంది. ఇక మోడీ గత రెండు టెర్ములూ పదేళ్ళలో ఎన్నో సార్లు విదేశాలకు వెళ్ళి వచ్చారు. ఇక జూన్ 9న ఆయన మూడవసారి ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. అంటే గట్టిగా రెండున్నర నెలలు అన్న మాట. ఈ తక్కువ టైం లోనే ప్రధాని రెండోసారి విదేశీ పర్యటనను పెట్టుకున్నారు.

గతసారి రష్యాతో పాటు ఇతర దేశాలలో పర్యటించిన మోడీ ఈసారి ఉక్రెయిన్ తో పాటు పోలాండ్ కూడా వెళ్తున్నారు. ప్రధాని విదేశీ పర్యటన గురించి కేంద్ర విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం చూస్తే మోడీ ఈ నెల 21న పోలాండ్, 23న ఉక్రెయిన్ దేశాలలో పర్యటించనున్నారు.

అయితే మోడీ విదేశీ పర్యటన మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మోడీ ప్రధానిగా చూస్తే ఒక ఏడాదిలో సగటున ఎన్ని రోజులు విదేశీ పర్యటనలలో ఉంటున్నారు అన్న దాని మీద కూడా ఒక స్థాయి డిస్కషన్ నడుస్తోంది. ఒక ఏడాదిలో ఎక్కువ విదేశీ టూర్లు ప్రధాని మోడీవి ఉన్నాయని కూడా అంటున్నారు.

ఇక గతంలో చూస్తే రాహుల్ గాంధీ భారత్ లో కంటే విదేశాల్లోనే ఎక్కువ ఉంటారని బీజేపీ నేతలు ఘాటు విమర్శలు చేసేవారు. పైగా ఆయన విదేశీ టూర్లను కూడా ఎద్దేవా చేసేవారు. మరి ఇపుడు మోడీ ఏమి చేస్తున్నారు అని కాంగ్రెస్ వారు రివర్స్ లో బీజేపీ నేతలను ప్రశ్నిస్తున్నారు.

నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని. ఆయనకు ప్రజలు అయిదేళ్ల పాటు పాలించే అధికారం ఇచ్చారు. ఆయన విదేశీ పర్యటనలు చేయకూడదని కాదు కానీ దేశ ప్రధానిగా ఆయన ఎక్కువ రోజులు స్వదేశంలో ఉంటూ చక్కబెట్టాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి కదా అన్నదే చాలా మంది భావన.

మోడీ మాత్రం విదేశీ టూర్లకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు అని కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మోడీ విదేశీ పర్యటనల వల్ల భారత్ అన్ని దేశాలకు మిత్రుడు అయింది అన్న మాటను బీజేపీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో భారత్ ఎగుమతులు పెరిగాయా అన్నది మరో ప్రశ్నను విపక్షాలు సంధిస్తున్నాయి.

భారత్ తటస్థ విదేశాంగ విధానం అమలు చేస్తోంది. అన్ని దేశాలకూ మిత్రుడిగా ఉంటోంది. ఇది మోడీ ప్రధాని కాక ముందు నుంచి కూడా కొనసాగుతున్న వ్యవహారమే అని గుర్తు చేస్తున్నారు. కొత్తగా మోడీ విదేశీ పర్యటనల వల్ల భారత్ కి ఉపయోగం ఏమి జరిగింది అన్న చర్చ సైతం వస్తోంది.

మోడీ విదేశీ పర్యటనల వల్ల దేశానికి చేకూరిన మేలు ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మరో వైపు చూస్తే దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అదే విధంగా కొత్త ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లు కూడా ఉన్నాయి. పదేళ్ళ పాటు ప్రధానిగా ఉంటూ మూడవసారి నెగ్గిన మోడీ మీద మరింత బాధ్యత కూడా ఉందని అంటున్నారు.

దీంతో ఇంట గెలవాల్సినవి చాలానే ఉన్నాయని కూడా అంటున్నారు. కానీ మొదటి నుంచి మోడీ విదేశీ పర్యటనలకు ప్రాముఖ్యత ఇవ్వడం పట్ల మాత్రం విపక్షాల నుంచి విమర్శలే వస్తున్నాయి. రష్యాకు మొదట వెళ్ళిన మోడీ ఇపుడు ఉక్రెయిన్ కి వెళ్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య గత రెండున్నరేళ్లుగా యుద్ధం సాగుతోంది. మరి ఈ యుద్ధాన్ని ఆపగలిగితే మోడీకే కాదు భారత్ కి కూడా పేరు వస్తుంది. అదే సమయంలో భారత్ కి ఆర్థికంగా ఇతరత్రా ఏమి వస్తుంది అన్నది కూడా మరో చర్చగా ఉంది.

ఒక దేశం నుంచి ఎగుమతులు పెద్ద ఎత్తున పెరగడం విదేశీ ద్రవ్య నిల్వలు పెరగడం వంటివే కొలమానంగా తీసుకుంటూటారు. అదే సమయంలో భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఇతర దేశాలు ఆసక్తిని చూపితే కూడా హర్షించేందుకు అంతా సిద్ధంగా ఉంటారు. అవి కాకుండా మోడీ చేసే విదేశీ యాత్రలు ఆయన ఇమేజ్ ని మరింతగా పెంచుకోవడానికి అయితే మాత్రం అది దేశానికి ఏమి లాభం అన్నదే విపక్షాల నిశిత విమర్శగా ఉంది. మరి బీజేపీ మోడీ అధిక విదేశీ పర్యటనలను ఏ విధంగా సమర్ధించుకుంటుందో చూడాలి.'