మోదీ హయాంలో ఎంపీల బహిష్కరణ పర్వం.. ఇప్పటికే ముగ్గురు!
డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగిన వ్యవహారంలో టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
By: Tupaki Desk | 9 Nov 2023 4:30 PM GMTడబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగిన వ్యవహారంలో టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ లోక్ సభ ఎథిక్స్ కమిటీ నివేదిక సిద్ధం చేసిందని, 500 పేజీలతో కూడిన ఆ నివేదికలో సంచలన విషయాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. మహువాపై చట్టపరమైన, సంస్థాగత, కాలపరిమితితో కూడిన దర్యాప్తు జరపాలని లోక్ సభ స్పీకర్ ను కోరినట్ల సమాచారం. ప్రధాని మోదీ, అదానీ గ్రూప్ ను టార్గెట్ గా చేసుకుంటూ లోక్ సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరనందాని నుంచి మోయిత్రా డబ్బు, బహుమతులు తీసుకున్నారంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబె ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎథిక్స్ కమిటీ విచారణ జరిపింది. మహువా చర్యలు అత్యంత అభ్యంతరకరం, హేయం, నేరం అంటూ తీవ్ర పదజాలంతో నివేదికను రూపొందించినట్లుగా చెబుతున్నారు.
వేటు తప్పదా..?
ఎథిక్స్ కమిటీ తన నివేదికను పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో స్పీకర్ కు సమర్పించనుంది. దీనిపై చర్చ అనంతరం చర్యలకు అవకాశం ఉంటుంది. కాగా, మహువాపై బహిష్కరణ వేటు తప్పదని భావిస్తున్నారు. అదే జరిగితే ఈ లోక్ సభ కాల పరిమితిలో సభ్యత్వం కోల్పోనున్న మూడో ఎంపీ మహువా కానున్నారు. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీకి చెందిన మహువా.. ఉన్నత విద్యావంతురాలు. అమెరికాలో బహుళ జాతి సంస్థలో ఉన్నత హోదాలో పనిచేసి స్వదేశానికి తిరిగొచ్చారు. పార్లమెంటులో మోదీ ప్రభుత్వాన్ని వివిధ అంశాలపై తన వాగ్ధాటితో మహువా తీవ్రంగా విమర్శించేవారు. దీంతో ఆమెకు ఫైర్ బ్రాండ్ ఎంపీగా పేరొచ్చింది. అయితే, పార్లమెంటు లాగిన్ ను బయటి వ్యక్తులకు ఇవ్వడం, ప్రశ్నకు డబ్బు వ్యవహారం ఆమె మెడకు చుట్టుకుంటోంది. మోయిత్రాపై వేటు తప్పదని స్పష్టమవుతోంది.
మూడో ఎంపీ..
మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాలపై మరింత దూకుడుగా వెళ్లారు. మొదటిసారి కూడా ప్రతిపక్షాలు బలంగానే ఉన్నా.. ఇప్పటిలా అప్పట్లో గళం వినిపించలేదు. ఈసారి మాత్రం విపక్షాలు.. మోదీని దించేయాలన్న పంతానికి వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న విభేదాలను పక్కనపెట్టి.. ‘‘ఇండియా’’ అంటూ జాతీయ స్థాయిలో కూటమి కట్టాయి. కాగా, మోయిత్రా సభ్యత్వంపై వేటు విషయానికి వస్తే.. 2019 తర్వాత కొలువుదీరిన మోదీ ప్రభుత్వంలో బహిష్కరణను ఎదుర్కొంటున్న మూడో ఎంపీ కానున్నారు. ఈ ఏడాది మార్చిలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా లోక్ సభ సభ్యత్వం కోల్పోయిన సంగతి తెలిసిందే. ‘మోదీ’ ఇంటి పేరు ఉన్నవారంతా దొంగలు అనే అర్థంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలకు గాను గుజరాత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడం దాని ఆధారంగా ఆయన లోక సభ సభ్యత్వం రద్దు చేయడం, ఆ తర్వాత ఇది పెద్ద దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఇక లక్షద్వీప్ నకు చెందిన మొహమ్మద్ ఫైజల్ హత్య కేసులో అనర్హత వేటుకు గురయ్యారు. ఎన్సీపీకి చెందిన ఈయన విషయంలో పెద్ద హైడ్రామానే నడిచింది. మొదట నేరారోపణపై సస్పెన్షన్ కు గురికాగా.. దానిని కేరళ హైకోర్టు తిరస్కరించింది. ఆ ఉత్తర్వుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. చివరకు గత నెల 9న రెండోసారి లోక్ సభ సెక్రటేరియట్ ఫైజల్ పై వేటు వేసింది.
కొసమెరుపు: రాహుల్ గాంధీ (కాంగ్రెస్), మహువా మోయిత్రా (టీఎంసీ), ఫైజల్ (ఎన్సీపీ) ముగ్గురూ కీలకమైన ప్రతిపక్షాలకు చెందినవారే. వీరిలో రాహుల్ అత్యంత ముఖ్యమైన నేత. మహువా తన వాక్పటిమతో కేంద్ర ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. రాహుల్ సస్పెన్షన్ కక్షపూరితంగా చేసిందనే అభిప్రాయం వ్యక్తమైంది. లోక్ సభను కుదిపేసింది. చిత్రం ఏమంటే.. రాహుల్, మహువా ఇద్దరూ మోదీ-అదానీ బంధాన్ని ప్రశ్నిస్తున్నవారే.