గుండెను పట్టుకొని చదవండి.. 9 ఏళ్లలో రూ.14.56 లక్షల కోట్లు రైటాఫ్
మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన 9 ఏళ్లలో బ్యాంకులు రైటాఫ్ చేసిన మొండి బకాయిల విలువ రూ.14,56,226 కోట్లుగా పేర్కొన్నారు
By: Tupaki Desk | 8 Aug 2023 4:46 AM GMTఈఎంఐ కట్టటం ఆలస్యమైతే సిబిల్ స్కోర్ ఎఫెక్టు అవుతుంది. క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో కట్టకున్నా సిబిల్ స్కోర్ ప్రభావితం అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే సామాన్యుడికి సంబంధించిన బ్యాంకులతో ఏదైనా తేడాగా వ్యవహరిస్తే అప్పు పుట్టే అవకాశం కూడా ఉండదు. అంతేనా.. అలాంటి వ్యక్తుల విషయంలో బ్యాంకులు.. ఆర్థిక సంస్థలు మహా జాగ్రత్తగా ఉంటాయి. వ్యక్తుల విషయంలో ఇంత పక్కాగా ఉండే బ్యాంకులు.. సంస్థల విషయంలో మాత్రం అలా ఎందుకు ఉండవు? అన్న సందేహం తరచూ వస్తుంటుంది.
కానీ.. సమాధానమే చెప్పరు. తాజాగా వెల్లడైన లెక్కల గురించి.. అందులోని విషయం గురించి తెలిస్తే గుండె చిక్కబడుతుంది. ఇంత భారీగా ప్రజాధనం వేస్ట్ అవుతుందా? ట్యాక్స్ పేయర్స్ డబ్బులు ఇంతలా దెబ్బ పడినా.. అందుకు బాధ్యులైన వారి విషయంలో కఠినంగా వ్యవహరించే విషయంలో ప్రభుత్వాలు ఎందుకంతలా తటపటాయిస్తాయి? అన్నది ప్రశ్న.
వ్యక్తిగత హోదాలో మినహాయింపుల విషయంలో ససేమిరా అనే బ్యాంకులు.. సంస్థల విషయంలో మాత్రం భిన్నంగా ఎందుకు ఉంటుంది? అన్నది ప్రశ్న. పార్లమెంటు సమావేశాల సందర్భంగా భారీ పరిశ్రమలు.. సేవల రంగానికి చెందిన మొండి బకాయిల్ని రైటాఫ్(రద్దు) చేసిన మొత్తం ఎంత? అని ప్రశ్నించగా దానికి ఆర్థిక సహాయ మంత్రి భగవత్ కరాద్ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం చూస్తే.. ఇంత భారీ మొత్తాన్ని కేంద్రం రైటాఫ్ చేసిందా? అనుకోకుండా ఉండలేం.
మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన 9 ఏళ్లలో బ్యాంకులు రైటాఫ్ చేసిన మొండి బకాయిల విలువ రూ.14,56,226 కోట్లుగా పేర్కొన్నారు. ఈ సంస్థల ఖాతాలకు సంబంధించిన చట్టబద్ధమైన.. రికవరీకి సంబంధించిన చర్యలు సాగుతాయని చెప్పినా.. దాని ఫలితం శూన్యమని చెప్పక తప్పదు. మొండి బకాయిల బరువు తగ్గించటానికి ప్రభుత్వం.. రిజర్వు బ్యాంకు ఇండియాలు సమగ్ర చర్యలు తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. 2018 మార్చి 31 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్ పీఏలు రూ.8.96 లక్షల కోట్లు ఉంటే.. 2023 మార్చి 31 నాటికి ఈ విలువ రూ.4.28 లక్షల కోట్లకు తగ్గినట్లుగా పేర్కొన్నారు.
బ్యాంకుల నుంచి రూ.5 కోట్లు అంతకంటే ఎక్కువ అప్పును తీసుకున్న సంస్థలు ఏవైనా డిఫాల్ట్ అయితే.. బ్యాంకులు ఆ సమాచారాన్ని ప్రతి వారం సీఆర్ఐఎల్సీకి నివేదిస్తున్నట్లుగా చెప్పారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ ఆర్థిక అధికార పరిధిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచటం వల్ల ఎక్కువ ఖాతాల మీద ఫోకస్ చేసే వీలు కలిగిందని చెప్పాలి. రూ.500 కోట్లకు పైగా ఒత్తిడితో ఉన్న ఆస్తుల్ని పరిష్కరించే లక్ష్యంతో నేషనల్ అసెట్ రీకన్ స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ ను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు.
ఉద్దేశపూర్వకంగా రుణాల్ని ఎగవేసే సంస్థల విషయంలో కొన్ని పరిమితుల్ని తీసుకొచ్చారు. రుణాల్ని రైటాఫ్ చేసిన యూనిట్ ఐదేళ్ల పాటు కొత్త వెంచర్ నిర్వహించకుండా బ్యాన్ ఉన్నట్లు పేర్కొన్నారు. అది.. ఉన్నప్పటికీ రుణాల్ని రైటాఫ్ చేసే పరిస్థితులు ఉండటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.