'ఏమో తెలీదు': అన్నింటికీ మోడీ సర్కారు సమాధానం ఇదే!
అయితే.. అనంతరం ప్రారంభమైన సమావేశాల్లో ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టారు. తర్వాత.. ప్రతిపక్ష నాయకులు కొందరు కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటికి మోడీ సర్కారు చెప్పిన సమాధానం ఒక్కటే ''ఏమో తెలీదు'' అనే!
By: Tupaki Desk | 23 July 2024 3:40 AM GMTదేశంలో వరుసగా మూడో సారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని, గర్వంగా ఉందని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవడానికి ముందు ఆయన మీడియాతో చెప్పిన మాట ఇది. అయితే.. అనంతరం ప్రారంభమైన సమావేశాల్లో ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టారు. తర్వాత.. ప్రతిపక్ష నాయకులు కొందరు కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటికి మోడీ సర్కారు చెప్పిన సమాధానం ఒక్కటే ''ఏమో తెలీదు'' అనే! ఆ ప్రశ్నలను కాంగ్రెస్ పక్ష నాయకుడు, పార్లమెంటులో విపక్ష నేత రాహుల్ గాంధీ సంధించగా.. ఆయా శాఖల మంత్రులు సమాధానం చెప్పారు. అయితే.. అందరిదీ ఒకే సమాధానం ''ఏమో తెలీదు'' అనే!! మరి ఆప్రశ్నలు ఏంటి? అనేది ఆసక్తిగా మారింది.
ప్రశ్న: నీట్ పరీక్ష పేపర్ లీకైంది. 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించింది. ఈ పేపర్ ఎక్కడ లీకైంది. ఎలాంటి చర్యలు తీసుకున్నారు? బాధ్యులను గుర్తించి.. చర్యలు తీసుకున్నారా?
ఆన్సర్: ఎక్కడ లీకైందో తెలీదు. గుర్తించలేం. బాధ్యులను గుర్తించే పనిలో ఉన్నాం. చర్యలు చేపడతాం. మీకు తెలిస్తే కూడా చెప్పవచ్చు.
ప్రశ్న: దేశంలో రైలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి?
ఆన్సర్: ఏమో తెలీదు.
ప్రశ్న: కరోనా సమయంలో 11 లక్షల మంది అదనంగా చనిపోయారని సమాచారం ఉంది. దీనికి ఏమంటారు?
ఆన్సర్: ఏమీ తెలీదు. మీ దగ్గర సమాచారం ఉంటే ఇవ్వండి. పరిశీలిస్తాం.
ప్రశ్న: అయోధ్యలో రామమందిరంలోకి వర్షపు నీళ్లు వచ్చాయి. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
ఆన్సర్: ఏమో తెలీదు. మీకు సమాచారం ఉంటే ఇవ్వండి. చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: యూపీఎస్సీ పరీక్షలో పూజా ఖేద్కర్ 12 సార్లు రాశారు. దీనిపై సమాధానం ఏంటి?
ఆన్సర్: ఏమో తెలీదు. మీదగ్గర సమాధానం ఉంటే ఇవ్వండి. పరిశీలిస్తాం.
ప్రశ్న: యూపీఎస్సీ చైర్మన్ తన పదవికి రాజీనామా చేశారు.. కారణం ఏంటి?
ఆన్సర్: ఏమో తెలీదు.
ప్రశ్న: బీహార్ 30 వేల కోట్ల ఆర్థిక సాయం కోరింది. ఇస్తున్నారా?
ఆన్సర్: ఏమో తెలీదు.
ప్రశ్న: ప్రత్యేక హోదాపై మీ ఉద్దేశం ఏంటి? ఏపీ, బీహార్‌లకు ప్రత్యేక హోదా ఇస్తున్నారా?
ఆన్సర్: ఏమీ తెలీదు.
కొసమెరుపు: ఇలా.. అన్ని ప్రశ్నలకు ''ఏమో తెలీదు.. పరిశీలిస్తాం'' అని మంత్రులు సమాధానం చెబుతుంటే.. రాహుల్ గాంధీ చలోక్తి విసిరారు.. ''ప్రస్తుతం జరుగుతున్నవి బడ్జెట్ సమావేశాలేనా?'' అని ప్రశ్నించారు. దీనికి కూడా.. ''ఏమో తెలీదు'' అనే సమాధానం వస్తుందని ఆయన ఆశించారు. అయితే.. ఈ ప్రశ్నపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ.. ''ఔను.. మేం కాన్షియస్‌గానే ఉన్నాం. మీరే ఆందోళనలో ఉన్నారు. అందుకే ఈ ప్రశ్న వేశారు'' అని ఫైరయ్యారు.