సోనియా గ్యారెంటీలకు దీటుగా `మోడీ గ్యారెంటీ`లు.. ఏంటంటే!
ఇప్పటికే సోనియా గ్యారెంటీలు అంటూ.. ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు.
By: Tupaki Desk | 17 Nov 2023 3:15 AM GMTఎత్తుకు పై ఎత్తు! అనే సామెతను బీజేపీ అమలు చేస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు కు అడ్డుకట్ట వేసేలా మేనిఫెస్టోను వండి వార్చుతున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి మోడీ గ్యారెంటీ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే సోనియా గ్యారెంటీలు అంటూ.. ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు.
ఇక, ఇప్పుడు ఈ పరంపరలో ప్రధాని మోడీ పేరును బీజేపీ వినియోగించుకునేందుకు రెడీ అయింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా 8 అంశాలను చర్చించనుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. వీటిలో ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే 6 నెల్లలోనే అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం. రెండు.. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినంగా పాటిస్తామని ప్రకటించడం, మూడు పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు రూ.500లకే వంట గ్యాస్... వంటివి ప్రధానంగా మోడీ గ్యారెంటీల్లో ఉన్నట్టు సమాచారం.
అదేసమయంలో గిరిజన విశ్వ విద్యాలయం, సింగరేణిని మరింత బలోపేతం చేయడం, రైతులకు విద్యుత్, రైతు బంధు స్థానంలో పీఎం కిసాన్.. ఇలా.. కొన్ని పథకాలను ప్రకటించనున్నట్టు తెలిసింది. చదువుకునే ఆడపిల్లలకు సైకిళ్లు, మహిళలకు భద్రత వంటివాటిని బీజేపీ తన గ్యారెంటీల్లో చేర్చనుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా పోడు భూముల అంశాన్ని ఈ దఫా బీజేపీ మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా సోనియా గ్యారెంటీలకు దీటుగా మోడీ గ్యారెంటీలను తెరమీదికి తేవడం గమనార్హం.