Begin typing your search above and press return to search.

ఉద్రిక్తతల వేళ ఉక్రెయిన్ కు మోదీ.. అమెరికా స్పందన ఏమిటంటే.

2022లో ఉక్రెయిన్ పై రష్యా మొదలు పెట్టిన యుద్ధం తర్వాత ఆ దేశంలో పర్యటించిన అత్యంత కీలక నాయకుడు మోదీ మాత్రమే అని చెప్పాలి.

By:  Tupaki Desk   |   15 Aug 2024 2:30 PM GMT
ఉద్రిక్తతల వేళ ఉక్రెయిన్ కు మోదీ.. అమెరికా స్పందన ఏమిటంటే.
X

దాదాపు పదేళ్ల కాలంలో ప్రధాని మోదీ 70కి పైగా దేశాల్లో పర్యటించారు. చరిత్రలో భారత ప్రధానులెవరూ వెళ్లినట్లుగా కనిపించని మంగోలియాకూ వెళ్లారు. అయితే, వీటన్నిటిలోకి వివాదాస్పదమైన పర్యటన మాత్రం గత నెలలో జరిపిన రష్యా పర్యటన. 2022లో ఉక్రెయిన్ పై రష్యా మొదలు పెట్టిన యుద్ధం తర్వాత ఆ దేశంలో పర్యటించిన అత్యంత కీలక నాయకుడు మోదీ మాత్రమే అని చెప్పాలి. ఉత్తర కొరియా, చైనా, పాకిస్థాన్ అధినేతలు రష్యాకు వెళ్లినా, రష్యా అధ్యక్షుడు ఈ దేశాలకు వచ్చినా అది పెద్ద విషయం కాదు. ఇప్పుడిప్పుడే ప్రపంచ శక్తిగా ఎదుగుతున్న భారత్ కు ప్రధానిగా ఉన్న నాయకుడు ఈ సమయంలో రష్యాలో పర్యటించడం అంటే.. అది అమెరికా సహా పశ్చిమ దేశాలకు కంటగింపే.

రష్యా వెళ్లారు.. పుతిన్ ను వాటేసుకున్నారు..

మోదీ ప్రధాని అయ్యాక గతంలో రష్యాలో పర్యటించారు. అప్పటికే పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని అమెరికా సారథ్యంలోని నాటో కూటమి తీవ్రంగా నిరసిస్తుండగా.. పర్యటించడమే కాక పుతిన్ ను ఆలింగనం చేసుకున్నారు. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది యుద్ధాల కాలం కాదని.. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ చెబుతోంది. పుతిన్ కూ ఓసారి మోదీ ఇదే సంగతి చెప్పారు. ఐక్యరాజ్య సమితిలోనూ భారత్ పలుసార్లు తటస్థంగా వ్యవహరించింది. అలాంటిది మూడోసారి గెలిచాక అనూహ్యంగా రష్యా వెళ్లారు. ఇది ఎంతైనా అమెరికా వంటి దేశాలకు ఆగ్రహం తెప్పించి ఉంటుంది.

2 నెలల్లోపే ఉక్రెయిన్ కు..

రష్యా పర్యటన వివాదాస్పదం అయినందుకో ఏమో..? మోదీ ఆ వెంటనే ఉక్రెయిన్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అది కూడా రెండు నెలలు తిరగకుండానే. కాగా, మోదీ ఉక్రెయిన్ టూర్ పై అమెరికా స్పందించింది. ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి నెలకొల్పేందుకు భారత్‌ ప్రయత్నాలను స్వాగతించింది. అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ స్పోక్స్‌ పర్సన్‌ వేదాంత్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ.. మోదీ పర్యటన ఎప్పుడు ఉంటుందనేది ఆయన కార్యాలయం ధ్రువీకరించాల్సి ఉందని, తాము చెప్పడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించారు. కాగా, మోదీ గతంలో ఉక్రెయిన్ వెళ్లిందీ లేనిదీ తెలియరాకున్నా.. ఈ నెల 23న వెళ్తారని తెలుస్తోంది. ఇటీవల ఇటలీలో జరిగిన జి-7 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానిత హోదాలో పాల్గొన్న మోదీ.. జెలెన్‌ స్కీతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో గెలిచిన సమయంలో మోదీకి జెలెన్ స్కీ ఫోన్‌ చేసి అభినందనలు తెలియజేశారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా కోరారు.

ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ..

మొన్నటివరకు యుద్ధంలో ఆత్మరక్షణకు పోరాడిన ఉక్రెయిన్ ఇప్పుడు ఎదురుదాడి చేస్తోంది. ఇప్పటివరకు రష్యాపై డ్రోన్ దాడులకే పరిమితం అయినా.. తాజాగా ఆ దేశ భూభాగంలోకి చొరబడిన దాడులు చేస్తోంది. కస్క్‌ ప్రావిన్స్ లో వెయ్యి చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆక్రమించింది. బెల్గొరోడ్‌ లోనూ దాడులను పెంచి.. 100 మంది పైగా రష్యా సైనికులను పట్టుకుంది. రష్యా సుఖోయ్‌-34 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని తెలిపింది. ఉక్రెయిన్ ధాటికి రష్యా ప్రస్తుతం కస్క్‌, బెల్గొరోడ్‌ లో ఎమర్జెన్సీ విధించింది.