Begin typing your search above and press return to search.

మోడీకి త‌ల‌నొప్పిగా మారుతున్న ఏపీ రాజ‌కీయాలు!

అటు చంద్ర‌బాబు లిక్క‌ర్ పాల‌సీలో జ‌రిగిన ల‌క్ష కోట్ల మ‌నీలాండ‌రింగ్ కేసును ఈడీకి అప్ప‌గిస్తామ‌న్నారు.

By:  Tupaki Desk   |   26 July 2024 6:14 AM GMT
మోడీకి త‌ల‌నొప్పిగా మారుతున్న ఏపీ రాజ‌కీయాలు!
X

ఏపీలో చోటు చేసుకుంటున్న రాజ‌కీయాలు.. కేంద్రంలోనిన‌రేంద్ర మోడీ స‌ర్కారుకు త‌ల‌నొప్పిగా మారు తున్నాయా? ముఖ్యంగా మోడీకి వ్య‌క్తిగ‌తంగా మ‌రిన్నిఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయా? అంటే.. ఔన నే అంటున్నారు విశ్లేష‌కులు. తాజాగా జ‌రిగిన రెండు ప‌రిణామాలు.. మోడీని సంక‌టంలోకి నెట్టేశాయి. ఒక‌టి.. ఏపీ సీఎం చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న‌. రెండు బీజేపీ ఎంపీ పార్ల‌మెంటులో నిల‌దీసిన అంశం. ఈ రెండు కూడా.. వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ చుట్టూ తిరుగుతున్న‌వే కావ‌డం గ‌మ‌నార్హం.

సీఎం చంద్ర‌బాబు విష‌యాన్ని చూస్తే.. గ‌త ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన వైసీపీ లిక్క‌ర్ పాల‌సీని అడ్డుపె ట్టుకుని రూ.ల‌క్ష కోట్ల వ‌ర‌కు దోచుకుంద‌ని తెలిపారు. లిక్క‌ర్ పాల‌సీపై అసెంబ్లీలో శ్వేత ప‌త్రాన్ని విడుద ల చేసిన చంద్ర‌బాబు.. వైసీపీ పాల‌న‌లో అనుస‌రించిన పాల‌సీలో చోటు చేసుకున్న వివాదాస్ప‌ద అంశా లు స‌హా.. న‌గ‌దుతోనే వ్యాపారం చేయ‌డాన్ని నిశితంగా ప్ర‌శ్నించారు. రూ.ల‌క్ష కోట్ల మ‌నీ లాండ‌రింగ్ జ‌రి గింద‌ని కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక్క‌డితో కూడా ఆగ‌లేదు. దీనిని `ఈడీకి` అప్ప‌గిస్తున్నామ ని.. ఈ విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని తేల్చి చెప్పారు.

ఇక‌, పార్ల‌మెంటులో బీజేపీ అన‌కాప‌ల్లి ఎంపీ సీఎం ర‌మేష్ కూడా.. ఏపీ అసెంబ్లీలో విడ‌త‌ల వారీగా వెలువ‌రిస్తున్న వైసీపీ పాల‌న‌పై శ్వేత‌ప‌త్రాల అంశాన్ని ప్ర‌స్తావించారు. ల్యాండు, శాండు, మైనింగ్‌, లిక్క‌ర్ విష‌యంలో వైసీపీ ప్ర‌జాధ‌నాన్ని లూటీ చేసింద‌ని.. దీనికి త‌గిన సాక్షాల‌తో ఏపీలోని ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వం శ్వేత‌ప‌త్రాలు విడుద‌ల చేస్తోంద‌ని లోక్‌స‌భ‌లోనే చెప్పారు. వీటిపై కేంద్ర‌మే విచార‌ణకు ఆదేశించాల‌న్నారు. అంతేకాదు.. దీనిపై స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీశారు.

మోడీకి ఎలా త‌ల‌నొప్పి?

అటు చంద్ర‌బాబు లిక్క‌ర్ పాల‌సీలో జ‌రిగిన ల‌క్ష కోట్ల మ‌నీలాండ‌రింగ్ కేసును ఈడీకి అప్ప‌గిస్తామ‌న్నారు. ఈడీ ప్ర‌ధాని మోడీ చేతిలోనే ఉంద‌న్న విష‌యం తెలిసిందే. ఆయ‌న ఆదేశిస్తేనే ఈడీ ముందుకు క‌దులుతుంద‌ని అంటారు. సో.. ఇప్పుడు ఆయ‌న మిత్ర‌ధ‌ర్మాన్ని పాటించి.. ఆదేశిస్తే.. అటు ఉన్న‌ది కూడా.. తెర‌చాటు మిత్రుడు జ‌గ‌నే. గ‌త ప‌దేళ్లే కాదు.. ఇటీవ‌ల స్పీక‌ర్ ఎన్నిక స‌మ‌యంలోనూ మ‌ద్ద‌తిచ్చారు. అంతేకాదు.. రేపు రాజ్య‌స‌భ‌లోనూ 11 మంది ఎంపీల‌తో మ‌ద్ద‌తిచ్చేది కూడా.. ఆయ‌నే. ఏ బిల్లు తీసుకువ‌చ్చినా.. ఓడ‌గొట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి రాజ్య‌స‌భ‌లో కాచుకుని కూర్చుంది.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ అవ‌స‌రం అక్క‌డ మోడీకి ఎక్కువ‌గా ఉంది. బ‌హిరంగంగా చేతులు క‌ల‌క‌పోయినా.. ప‌రోక్షంగా జ‌గ‌న్ త‌మ‌తోనే ఉన్నాడ‌ని బీజేపీ కూడా భావిస్తున్న ద‌రిమిలా.. మోడీ ఈడీని ఎలా ఆదేశించ‌గ‌ల‌రు? ఇక‌, సీఎం ర‌మేష్ విష‌యంలోనూ.. విచార‌ణ‌కు ఆదేశించే ప్ర‌య‌త్నం చేయ‌డం దుస్సాహ‌స‌మే అవుతుంది. జ‌గ‌న్‌ను వ‌దులుకుంటే.. ఇండియా కూట‌మి ఆయ‌న‌ను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉంద‌నే సంకేతాలు ఇచ్చేసింది. దీంతో ఏపీ రాజ‌కీయాలు మోడీకి త‌ల‌నొప్పిగా మారుతున్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.