Begin typing your search above and press return to search.

తొలిసారి హైదరాబాద్ రోడ్ల మీద మోడీ ప్రచారం

నాటకీయతను నరనరాన నింపుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల వేళ.. దాన్ని మరింత పండించేందుకు దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తారు.

By:  Tupaki Desk   |   27 Nov 2023 4:06 AM GMT
తొలిసారి హైదరాబాద్ రోడ్ల మీద మోడీ ప్రచారం
X

అదేందండి.. దేశ ప్రధానమంత్రిని పట్టుకొని అలా అనేస్తారు? అన్న భావన కలగొచ్చు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వేళలో ఇలాంటి భావన కలగొచ్చు. కానీ.. వాస్తవం ఇదేనన్నది మర్చిపోకూడదు. నాటకీయతను నరనరాన నింపుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల వేళ.. దాన్ని మరింత పండించేందుకు దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరిస్తారు. అందుకు నిలువెత్తు నిదర్శనంగా ఈ రోజు హైదరాబాద్ లో ఆయన చేస్తున్న రోడ్ షో.

దేశ ప్రధానిగా వ్యవహరిస్తూ.. ఒక రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం రోడ్ షో నిర్వహించే విషయంలో పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. కాకుంటే.. నాలుగైదు బహిరంగ సభల్లో తమ వాణిని వినిపించి వెళ్లేవారు. అలా చేస్తే ఆయన నరేంద్ర మోడీ ఎందుకు అవుతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ పదేళ్లలో ఎప్పుడూ లేనంత ఫోకస్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల వేళ నరేంద్ర మోడీ పెడుతున్నారని చెప్పక తప్పదు. ఈసారి స్పెషల్ ఏమంటే.. హైదరాబాద్ మహానగరం రోడ్ల మీదకు వచ్చి రెండు కిలోమీటర్ల మేర ఎన్నికల ప్రచారం చేయటం విశేషంగా చెప్పాలి.

తిరుపతి నుంచి తెలంగాణలో ఎంట్రీ ఇచ్చే ఆయన జిల్లా కేంద్రాల్లో నిర్వహించే సభల్లో పాల్గొని.. సాయంత్రం నాలుగున్నర గంటల వేళకు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం గంట పాటు హైదరాబాద్ ప్రధాన రోడ్ మీద ప్రచారం చేయనున్నారు. అయితే.. ఈ ప్రచారం సెంట్రల్ హైదరాబాద్ ప్రాంతంలో జరగటం గమనార్హం. ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. లక్ష్మణ్ లాంటి ముఖ్యనేతలకు అడ్డాలాంటి ప్రాంతం కావటం గమనార్హం. ఆయన రోడ్ షో నిర్వహిస్తున్న ప్రాంతాల్ని చూస్తే.. రెండు నియోజకవర్గాల పరిధిలో ఉంది. అందులో ఒకటి ముషీరాబాద్ కాగా రెండోది అంబర్ పేట.

ముషీరాబాద్ నియోజకవర్గం అన్నంతనే డాక్టర్ లక్ష్మణ్ గుర్తుకు రాక మానరు. ఇక.. అంబర్ పేట కేంద్ర మంత్రి కమ్ టీ బీజేపీ రథసారధి కిషన్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన అంబర్ పేట నియోజకవర్గంగా చెప్పాలి. ఈ రోజు (సోమవారం) సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ మహానగరానికి చేరుకోనున్న నరేంద్ర మోడీ తన రోడ్ షోను ఒకప్పటి భాగ్యనగర్ సినిమా హాళ్లకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి షురూ చేస్తారు.

అక్కడి నుంచి చిక్కడపల్లి.. వైఎంసీ.. నారాయణగూడ ఫ్లైఓవర్.. నారాయణగూడ మార్కెట్.. కాచిగూడ చౌరస్తా.. వీరసావర్కర్ విగ్రహం ప్రాంతాల్ని కవర్ చేస్తారు. దాదాపు గంట వరకు ఈ రోడ్ షో జరగనుంది. అనంతరం ఆయన అమీర్ పేటలోని గురుద్వారాకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ఈ ప్రాంతం కీలకమైన సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బరిలో ఉన్నారు.

దేశ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇలా హైదరాబాద్ మహానగరంలో రోడ్ షా చేసిన రికార్డు నరేంద్ర మోడీ పేరున ఉండిపోతుందంటున్నారు. ప్రధానమంత్రి దాకా ఎందుకు? ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తన పొలిటికిల్ కెరీర్ లో ఏ రోజు కూడా మోడీ మాదిరి హైదరాబాద్ రోడ్ల మీద రోడ్ షో చేసింది లేదన్న మాట వినిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే.. హైదరాబాద్ మహానగరంలో ప్రచారానికి ప్రధాని మోడీ ఇస్తున్న ప్రాధాన్యత ఎంతన్నది ఇట్టే అర్థం కాక మానదు.