Begin typing your search above and press return to search.

మోదీ బీజేపీ లోక్ సభా పక్ష నేతగా ఎన్నికయ్యారా? లేదా?

దేశంలో స్వాతంత్ర్యం తర్వాత మొదటి ఎన్నికల (1952)ను మినహాయిస్తే.. ఇటీవలి ఎన్నికలు అత్యంత సుదీర్ఘంగా సాగాయి.

By:  Tupaki Desk   |   24 Jun 2024 11:42 AM GMT
మోదీ బీజేపీ లోక్ సభా పక్ష నేతగా ఎన్నికయ్యారా? లేదా?
X

దేశంలో స్వాతంత్ర్యం తర్వాత మొదటి ఎన్నికల (1952)ను మినహాయిస్తే.. ఇటీవలి ఎన్నికలు అత్యంత సుదీర్ఘంగా సాగాయి. మార్చి 16న షెడ్యూల్ విడుదలైతే జూన్ 4న ఫలితాలు వచ్చాయి. 80 రోజులకు పైగా ప్రక్రియ జరిగింది. ఇక కొత్త ప్రభుత్వం మూడోసార నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఏర్పడింది. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) పక్ష నేతగా మోదీని ఎన్నుకోవడం.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆయనను రాష్ట్రపతి ఆహ్వానించడం.. మోదీ హ్యాట్రిక్ ప్రధాని కావడం అంతా జరిగిపోయింది. ఇక మంగళవారం నుంచి 18వ లోక్ సభ కొలువుదీరనుంది.

పార్టీ ఎంపీలు ఎన్నుకోలేదా?

ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఎన్నుకోవడం సరే.. అది ఓ కూటమి నాయకత్వం. కానీ, బీజేపీ లోక్ సభా పక్ష నేతగా మోదీని ఎన్నుకున్నారా? లేదా? అనేది సందిగ్ధంగా మారింది. ఎన్నికల్లో సహజంగా ఏదైనా అధిక సీట్లు సాధించిన పార్టీ పక్ష నాయకుడు రాష్ట్రాల్లో సీఎం లేదా జాతీయ స్థాయిలో ప్రధాని పదవి చేపడతారు. దీనికిముందు ఫలానా వ్యక్తిని లోక్ సభా పక్ష/శాసన సభా పక్ష నేతగా ఎన్నుకుంటారు. బీజేపీలో ఇటీవలి ఎన్నికల అనంతరం ఇలా జరిగిందా? లేదా? అన్నది స్పష్టత లేదు.

విమర్శకుల మాట ఇలా..

బీజేపీ లోక్ సభా పక్ష నేతగా మోదీని ఎన్నుకోలేదనేది ఆయన విమర్శకుల మాట. ఇది జరగకుండానే టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తదితర కూటమి పక్షాల నేతలు హాజరైన సమావేవంలో ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకున్నారని, ఆ తర్వాత నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని పేర్కొంటున్నారు. ఒకవేళ వీరి మాటలే నిజమైతే.. ఇలా జరగడం రాజ్యాంగబద్ధమేనా? అనేది ప్రశ్న తలెత్తుతోంది. ఏది ఏమైనా.. మోదీ మూడో విడత మొదలై 15 రోజులైంది. మంగళవారం నాటి పార్లమెంటు సమావేశాలకు ముందు ఆయనను బీజేపీ పక్ష నేతగా ఎన్నుకుంటారేమో చూడాలి.