Begin typing your search above and press return to search.

ఒక్కటంటే ఒక్క టఫ్ క్వశ్చన్ మోడీకి ఎందుకు వేయరబ్బా?

అద్భుతాలు ఆశించటం అత్యాశే అవుతుంది. అందునా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేసే అవకాశమే ఎవరికి రాదు.

By:  Tupaki Desk   |   16 April 2024 4:44 AM GMT
ఒక్కటంటే ఒక్క టఫ్ క్వశ్చన్ మోడీకి ఎందుకు వేయరబ్బా?
X

అద్భుతాలు ఆశించటం అత్యాశే అవుతుంది. అందునా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఇంటర్వ్యూ చేసే అవకాశమే ఎవరికి రాదు. ఆయనకు ఆయనగా.. ఎంపిక చేసుకున్న ఇద్దరు ముగ్గురితో తప్పించి ఆయన మాట్లాడటానికి ఇష్టపడరు. ఆయనకు ముందు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్న వారి మాదిరి మీడియా భేటీని నిర్వహించాలని భావించటం మరీ ఎక్కువగా కల కన్నట్లు అవుతుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే మోడీ మాష్టారు.. తాను ఎంపిక చేసుకున్న ఎఎన్ఐ రిపోర్టర్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

దగ్గర దగ్గరగా 75 నిమిషాల నిడివి ఉన్నఈ ఇంటర్వ్యూను చూసినప్పుడు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. సాధారణంగా ప్రశ్నించే అవకాశం రావాలే కానీ ప్రశ్నలు తన్నుకుంటూ వస్తాయి. అందునా.. పదేళ్లు నాన్ స్టాప్ గా దేశ ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీని అడిగేయాల్సిన ప్రశ్నలు.. సమాధానాలు రాబట్టాల్సిన అంశాలకు కొదవ లేదు. గడిచిన 65 ఏళ్లలో దేశ ప్రధానులుగా వ్యవహరించిన వారంతా చేసిన అప్పు కంటే ఎక్కువ అప్పు మోడీ హయాంలోనే జరిగిందన్న సంగతి తెలిసిందే.

అప్పు ఎందుకు చేశారు? అని అడగటం పద్దతి కాదు. కాకుంటే.. అంత భారీగా తెచ్చిన లక్షల కోట్ల రూపాయిల్ని ఎక్కడ వెచ్చించారు? అన్న సాదా ప్రశ్నను సంధించాలన్న ఆసక్తి జర్నలిస్టుగా పని చేస్తున్న ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అదేం సిత్రమో కానీ.. తాజా ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న మాత్రమే కాదు.. మోడీకి ఇబ్బంది కలిగించేది.. కాస్తంత కష్టంతో కూడుకున్న ఏ ప్రశ్నను వేయకుండా.. మోడీ మాష్టారు దేశ ప్రజలకు ఏం చెప్పాలని భావించారో వాటికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే సంధించటంలో అర్థం ఏమిటి? అన్నది ప్రశ్న. ఇంటర్వ్యూ మొత్తాన్ని చూస్తే.. భజన ప్రోగ్రాం తప్పించి ఇంకేమీ కనిపించని దుస్థితి.

ఇంటర్వ్యూలో భాగంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే క్రమంలో తన ఆశల్ని.. ఆశయాల్ని.. కలల్ని మాత్రమే ప్రస్తావించిన మోడీ.. తన మీద ఉన్న విమర్శలు.. తన పాలనపై ఎదురయ్యే ప్రశ్నల్ని ఇంటర్వ్యూ చేసిన మహిళా జర్నలిస్టు సంధించలేదు. ఇదంతా చూస్తే.. మోడీ సుడి మామూలు కాదన్న భావన కలుగుతుంది. ఇచ్చే ఇంటర్వ్యూలే అరుదు. అలా ఇచ్చిన రేర్ వేళలోనూ.. మోడీమాష్టారు కోరుకున్న ప్రశ్నలు మాత్రమే ఎదురు కావటానికి మించింది మరింకేమీ ఉంటుంది చెప్పండి?