మోడీ వస్తున్నారు.. ఏం తెస్తున్నారు.. నో ఆన్సర్..!
మొత్తంగా రెండు రోజులు కూడా ప్రధాని తెలుగు రాష్ట్రాల్లోనే ఉండను న్నారు.
By: Tupaki Desk | 16 March 2024 1:30 PM GMTరెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధానినరేంద్ర మోడీ వస్తున్నారు. ఈ రోజు తెలంగాణలో ఆయన పర్యటించ నున్నారు. ఈ రాష్ట్రంలో శనివారం కూడా ఆయన పర్యటించనున్నారు. అనంతరం.. ఆయన ఏపీలోకి ఎంట్రీఇస్తారు. ఇక్కడ కూడా రెండు రోజులు పర్యటిస్తారు. ముందుగా విశాఖలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. తర్వాత.. 17న బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి నిర్వహించే ఉమ్మడి బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. మొత్తంగా రెండు రోజులు కూడా ప్రధాని తెలుగు రాష్ట్రాల్లోనే ఉండను న్నారు.
కట్ చేస్తే.. మాకేం తెస్తారు? మాకేం ఇస్తారు? అనే టాక్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి వినిపిస్తోం ది. తెలంగాణలోనూ.. ఏపీలోనూ వివిధ అంశాలపై నెటిజన్లు ఇదే ప్రశ్న సంధిస్తున్నారు. ఏం తెస్తున్నారు మోడీ జీ! అంటూ.. ప్రశ్నలు కురిపిస్తున్నారు. తెలంగాణ ప్రస్తుతం విభజన హామీలను అమలు చేయాలని కోరుతోంది. అదేసమయంలో జల వివాదాలను పరిష్కరించాలని కూడా అభ్యర్థిస్తోంది. ఇక, కేంద్ర ప్రాజెక్టులు ఇస్తామని కూడా ఇవ్వకుండా చేతులు చూపుతున్నారనేది ప్రధాన ఆరోపణ.
ఈ నేపథ్యంలో తెలంగాణకు వస్తున్న ప్రధాని ఆయా అంశాలను ప్రస్తావించాలని కోరుతున్నారు. ఇక, ఏపీ విషయానికి వస్తే.. గతంలో అమరావతి రాజధాని శంకుస్థాపన చేసిన జిల్లాలోనే ప్రధాని మోడీ.. ఈ నెల 17న సభ నిర్వహించనున్నారు. దీంతో ఆయన నోటి నుంచి రాజధానిపై కీలక ప్రకటనను రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారు. మూడు రాజధానులు కాదు.. ఒకే రాజధాని అని బీజేపీ పదే పదే చెబుతోంది. రాజధాని రైతులకే తమ మద్దతు అని కూడా బీజేపీ తెలిపింది.
ఈ నేపథ్యంలో మోడీ నోటి నుంచి రాజధాని అమరావతికి మద్దతుగా ప్రకటన వస్తుందా? అనేది ఎక్కువ మంది ఎదురు చూస్తున్న ప్రశ్న. ఇక, రాష్ట్రం అప్పుల పాలైందనే వాదన బీజేపీ నేతల నుంచి కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ పాలనపై ఎలా రియాక్ట్ అవుతారు? అప్పులు, అక్రమాలు, అవినీతి పై ఎలాంటి స్పందన ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఇక, పోలవరం పూర్తి చేయడం, విశాఖ ఉక్కును తెగనమ్మకుండా ఉండడం వంటి వరాలు ప్రకటించాలనేది మెజారిటీ ప్రజల ఆలోచనగా ఉంది. మరి మోడీ ఏం చేస్తారో చూడాలి.