అనూహ్యం.. పదేళ్ల తర్వాత పాక్ కు మోదీ.. వెళ్లేది ఖాయమేనా?
ఇది ప్రపంచ మీడియాకు అతిపెద్ద సంచలనం.. భారత్- పాకిస్థాన్ లో అయితే ఆశ్చర్యమే.. ఇంతకూ ఏం జరిగిందో తెలిసే లోపల మోదీ భారత్ కు వచ్చేశారు.
By: Tupaki Desk | 25 Aug 2024 8:34 AM GMTఅది 2015 డిసెంబరు 25.. చలికాలం రాత్రి.. విదేశాల నుంచి వస్తున్న ఓ వీవీఐపీ విమానం అనూహ్యంగా దారి మళ్లింది.. ఏం జరుగుతున్నదో అర్థం కాలేదు. ఏదైనా జరిగితే అది పెద్ద సంచలనమే.. ఇంతలో ఆ విమానం పాకిస్థాన్ లోని లాహోర్ లో ఆగింది. అందులోంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ కిందకు దిగారు.. పాక్ అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ను ఆలింగనం చేసుకున్నారు. చేతిలో చేయివేసి కొంత దూరం నడిచారు. ఇది ప్రపంచ మీడియాకు అతిపెద్ద సంచలనం.. భారత్- పాకిస్థాన్ లో అయితే ఆశ్చర్యమే.. ఇంతకూ ఏం జరిగిందో తెలిసే లోపల మోదీ భారత్ కు వచ్చేశారు. ఇక ఇంతకూ డిసెంబరు 25 నవాజ్ షరీఫ్ జన్మదినం కావడం గమనార్హం.
మళ్లీ మోదీ కాలు పెడతారా?
ఈ పదేళ్లలో కాలం ఎంతో మారింది. భారత్ చాలా ముందుకెళ్లింది. ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. పాకిస్థాన్ లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం పతనమై.. ఆయన ప్రవాసానికి వెళ్లిపోయారు. ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి రావడం దిగిపోవడం జరిగింది. నవాజ్ షరీఫ్ తమ్ముడు షాబాజ్ ఇప్పుడు పాక్ ప్రధాని అయ్యారు. ఇక ఇరు దేశాల మధ్య పుల్వామా దాడి సహా ఈ పదేళ్లలో ఎన్నో ఉద్రిక్త ఘటనలు జరిగాయి. ప్రతిగా బాలాకోట్ పై భారత్ దాడులు చేసింది. ఇప్పుడు కశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ నుంచి మోదీకి అనూహ్య ఆహ్వానం అందింది. ఇటీవలే యుద్ధంలో మునిగి ఉన్న రష్యా, ఉక్రెయిన్ లలో పర్యటించిన మోదీ.. మరి చిరకాల శత్రువు పాకిస్థాన్ కూ వెళ్తారా? అనేది చూడాలి.
ఇంతకూ ఏమిటా సదస్సు?
మోదీని అక్టోబరులో ఇస్లామాబాద్ రావాలని ఆహ్వానించింది పాకిస్థాన్. కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సీహెచ్‌జీ) సమావేశానికి మోదీ, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో)కు చెందిన నేతలను ఆహ్వానించింది. నిరుడు సెప్టెంబరులో ఉజ్బెకిస్థాన్ సమర్కండ్ లో ఎస్‌సీవో సదస్సుకు మోదీ, చైనా, రష్యా అధ్యక్షులు జిన్ పింగ్, పుతిన్ సహా అగ్రనేతలంతా హాజరయ్యారు. కాగా, సీహెచ్ జీ సదస్సుకు మోదీ వెళ్లడం కష్టమే అంటున్నారు. పాకిస్థాన్ తో సంబంధాలు సమస్యాత్మకంగా ఉండడమే దీనికి కారణం. ఇటీవల జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడులు పెరిగాయి. దీంతో కనీసం విదేశాంగ మంత్రిని కూడా పాకిస్థాన్ కు పంపే ఉద్దేశం లేనట్లుగా తెలుస్తోంది. 2015లో అప్పటి భారత విదేశాంగమంత్రి గా ఉన్న సుష్మాస్వరాజ్ పాకిస్థాన్ లో పర్యటించారు. రష్యా, చైనా సారథ్యంలోని సీహెచ్‌జీలో భారత్, పాక్ లకు సభ్యత్వం ఉంది. ప్రాంతీయ భద్రత, మధ్య ఆసియా దేశాలతో సహకారాన్ని ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం సీహెచ్‌జీకి పాక్ అధ్యక్ష స్థానంలో ఉంది. అక్టోబరు 15-16 తేదీల్లో దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు ఇస్లామాబాద్ లో ప్లాన్ చేసింది.