ప్రధాని మోదీ ధరించిన తలపాగా ప్రత్యేకతలు ఇవే!
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ధరించిన ప్రత్యేక తలపాగా ఆకర్షణీయంగా నిలిచింది. ఈ తలపాగా అందరి దృష్టిని ఆకర్షించింది.
By: Tupaki Desk | 15 Aug 2024 6:02 AM GMTభారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ధరించిన ప్రత్యేక తలపాగా ఆకర్షణీయంగా నిలిచింది. ఈ తలపాగా అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ధరించిన తలపాగా ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకునే పనిలో పడ్డారు. కాగా ప్ర«ధానమంత్రి ధరించిన తలపాగా రాజస్థానీ లెహెరియా ప్రింట్ టర్బన్ అని చెబుతున్నారు. దీన్ని నారింజ, పసుపు, ఆకుపచ్చ రంగులను మిళితం చేసి రూపొందించారు. తెల్లటి కుర్తా, లేత నీలం రంగు బంద్ గాలా జాకెట్ వేసుకున్న ప్రధాని మోదీ తలపాగాగా రాజస్థానీ లెహెరియా ప్రింట్ టర్బన్ ను ధరించారు.
తద్వారా ప్రధాని మోదీ భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, భారతీయ సంప్రదాయ కళలను ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
లెహెరియా ప్రింట్ అనేది రాజస్థాన్ లో సంప్రదాయంగా వస్తున్న కళ. రాజస్థాన్ లోని థార్ ఎడారి ఇసుక మీదుగా వీచే గాలిని ఆధారంగా చేసుకుని రూపొందించారు. ఈ తలపాగాలను సంప్రదాయ పద్ధతిలో వస్త్రంతో టై – డై టెక్నిక్ తో తయారు చేస్తున్నారు.
ప్రధాని మోదీ దేశానికి చెందిన వివిధ సంప్రదాయ కళలను ప్రోత్సహించడం ఇదే మొదటిసారి కాదు. ఆయన తొలిసారి ప్రధాని అయిన 2014 నుంచి ఈ ఒరవడిని కొనసాగిస్తున్నారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రంగురంగుల తలపాగాలు ధరిస్తున్నారు.
2014లో ప్రధానిగా తన మొదటి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ రాజస్థానీ తలపాగాను ధరించారు. 2015లో అనేక రంగులతో క్రిస్–క్రాస్ లైన్ లతో కూడిన పసుపు తలపాగాను ఎంపిక చేసుకున్నారు. మోకాళ్ల కింద వరకు వేలాడే తలపాగాను నాడు మోదీ ధరించారు,
2016 ప్రధాని మోదీ టై – డై టర్బన్ ను ధరించారు. గులాబీ, పసుపు రంగులతో కూడిన ఈ తలపాగా ఆ సంవత్సరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
గతేడాది 2023లో కూడా ప్రధాని మోదీ రాజస్థాన్ కు చెందిన బంధానీ ప్రింట్ తో తయారుచేసిన తలపాగాను ధరించారు. పసుపు, పచ్చ, ఎరుపు రంగులతో కూడిన ఈ తలపాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఇలా ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ భారతదేశంలో సాంప్రదాయ కళలకు, చేనేత వృత్తులకు నిలయమైన వివిధ ప్రాంతాల తలపాగాలను ధరిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తద్వారా భారతీయ వారసత్వ కళలకు ప్రాచుర్యం కల్పిస్తున్నారు.