స్వయంగా మోడీ ప్రచారం చేసినా గెలవలేదే?
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు.
By: Tupaki Desk | 4 Dec 2023 1:00 PM GMTహైదరాబాద్ మహానగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేజిక్ అస్సలు పని చేయలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఒకదశలో ఆయన ఏకంగా నాలుగైదు కిలోమీటర్ల రోడ్ షోను నిర్వహించారు. అంతేకాదు.. పార్టీ వేదికకు సంబంధించి ఒకటి.. పార్టీకి సంబంధం లేని కార్యక్రమంలో హాజరు కావటమే కాదు.. గ్రేటర్ పరిధిలోని పలు కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఎన్నికల ప్రచారంలో నేరుగా పాల్గొన్నప్పటికీ మోడీ ప్రచారం చేసిన ఎక్కడా కూడా బీజేపీ అభ్యర్థులు ఓడిపోవటం ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఒకసారి ఎల్ బీ స్టేడియంలో పార్టీ కార్యక్రమానికి హాజరైన ఆయన.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన మాదిగల విశ్వరూప సభకు హాజరయ్యారు. ఇది కాకుండా రోడ్ షోతో పాటు.. అమీర్ పేట పరిధిలోని గురుద్వారాను సందర్శించారు.
ఎల్ బీ స్టేడియం పరిధిలో ఉండే ఖైరతాబాద్ తో పాటు.. పరేడ్ గ్రౌండ్ పరిధిలో ఉండే సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు.. అమీర్ పేటలోని గురుద్వారా పరిధిలోని సనత్ నగర్ నియోజకవర్గంతో పాటు.. మోడీ స్వయంగా రోడ్ షో నిర్వహించిన ముషీరాబాద్.. అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో.. ఎక్కడా కూడా బీజేపీ అభ్యర్థులు గెలిచింది లేదు. అన్నిచోట్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఇదంతా చూసినప్పుడు.. ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ప్రచారం చేసిన గ్రేటర్ నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఏమీ లేదన్న విషయం అర్థమవుతుంది. ఇదంతా చూస్తే.. మోడీ మేజిక్ గ్రేటర్ ప్రజల మీద ఏ మాత్రం పని చేయలేదని చెప్పక తప్పదు.