మహబూబాబాద్ సభ: ఎన్నికల వేళ మోడీ మేజిక్ ఇలానే ఉంటుంది!
అందుకు ప్రతిగా స్పందించిన ప్రధాని మోడీ ఒక్కసారిగా వంగి ఆమె కాళ్లకు నమస్కరించటం ద్వారా సభకు వచ్చిన వారందరికి గుర్తుండిపోయేలా చేశారు.
By: Tupaki Desk | 28 Nov 2023 4:55 AM GMTరాజకీయ ప్రత్యర్థులు.. రాజకీయ పరిశీలకులకు నిత్యం ఒక ఫజిల్ గా కనిపిస్తుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయన మాటలకు.. చేతలకు ఏ మాత్రం పొంతన ఉండదు. అదే సమయంలో కొన్నిసార్లు ఆయన చేసే చేష్టలు సామాన్యులకే కాదు అసమాన్యులకు సైతం అర్థం కాదు. పలు సందర్భాల్లో ఆయన తన ఆటిట్యూడ్ ను ఎంతలా చూపిస్తారో తెలిసిందే. గడ్డ కట్టే చలిలో వణుకుతు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ రైతులు చేసిన ఆందోళన వేళ.. ఆయన స్పందించిన తీరు చూసిన వారికి షాక్ తగిలింది.
తనను విబేదించే వారి విషయంలో మోడీ ఎంత కఠినంగా ఉంటారన్న విషయాన్ని గడిచిన పదేళ్లుగా చూస్తున్నదే. అలాంటి ఆయన..కొన్నిసార్లు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటమే కాదు.. ఇలాంటివి ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రమే సాధ్యమన్న భావన కలిగేలా చేయటమే కాదు.. దేశ ప్రజల మనసుల్లో గూడు కట్టేసుకోవటమే కాదు.. ఫ్లోర్ మీద ఫ్లోర్ వేసుకునే అవకాశాల్నిబోలెడన్న కల్పిస్తుంటారు. ఇంతకూ తాజాగా జరిగిన పరిణామం తెలిస్తే మోడీ మేజిక్ ఇలానే ఉంటుంది మరి అనుకోకుండా ఉండలేం.
మహబూబాబాద్ సభలో భాగంగా డోర్నకల్ బీజేపీ అభ్యర్థి భూక్యా సంగీత ప్రధాని నరేంద్ర మోడీని సన్మానించారు. అనంతరం ఆమె పాదాభివందనం చేసే ప్రయత్నం చేయగా.. అందుకు ప్రతిగా స్పందించిన ప్రధాని మోడీ ఒక్కసారిగా వంగి ఆమె కాళ్లకు నమస్కరించటం ద్వారా సభకు వచ్చిన వారందరికి గుర్తుండిపోయేలా చేశారు. నమస్కారానికి ప్రతినమస్కారం సంస్కారం అన్నది తనలో టన్నుల కొద్దీ ఉందన్న విషయాన్ని ఆయన తెలిసేలా చేశారు.
అయితే.. ఇలాంటి మేజిక్కులు ఎన్నికల వేళలో మోడీ చేస్తుంటారని చెబుతున్నారు. ఇదే సమయంలో.. గులాబీ బాస్ కేసీఆర్ కు సైతం కౌంటర్లు పడుతున్నాయి. అభ్యర్థి కాళ్లకు నమస్కారం చేస్తున్న ప్రధాని మోడీ ఫోటోను చూపించి.. ఇలాంటివి ఎప్పుడైనా చేశారా? అని ప్రశ్నిస్తున్నారు. చావు ముఖంలోకి తల పెట్టి బయటకు వచ్చినోడ్ని అంటూ తరచూ చెప్పే కేసీఆర్.. ఏ రోజైనా ఒక మహిళా నేత విషయంలో ఇలాంటి గౌరవ మర్యాదల్ని ప్రదర్శించారా? అంటూ ప్రశ్నించటం కనిపిస్తోంది. ఏమైనా.. కీలక ఎన్నికల సమయంలో మోడీ ఇలాంటి మేజిక్కులు చేస్తుంటారని ఆయన గురించి తెలిసిన వారంతా వ్యాఖ్యానించటం గమనార్హం. ఏమైనా.. వేలాది సభికుల ఎదుట పార్టీ మహిళా అభ్యర్థి కాళ్లకు నమస్కరించే సన్నివేశం అందరిని విస్మయానికి గురి చేసిందని మాత్రం చెప్పక తప్పదు.